మళ్లీ అదే ముగ్గురు-ఓటేస్తే సంక్షేమం వద్దన్నట్లే-గుంటూరులో జగన్ వ్యాఖ్యలు..
గుంటూరులో జరిగిన వైసీపీ మేమంతా సిద్ధం సభలో ఇవాళ సీఎం జగన్ మరోసారి విపక్షాలపై నిప్పులు చెరిగారు. 58 నెలలుగా చేస్తున్న అభివృద్ధిని కొనసాగించేలా ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు చంద్రబాబు మోసాలకు, ప్రజలకూ మధ్య జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంగా ఆయన అభివర్ణించారు. 2014 తరహాలోనే మళ్లీ ముగ్గురు మోసం చేసేందుకు గుంపుగా వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జగన్ కోరారు.
చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ.. అంతా అబద్ధాలు బుర్రకథగా చెబుతున్నారని జగన్ ఆరోపించారు. కానీ ఇదే కూటమి 2014లో ఇచ్చిన హామీల్ని ఒక్కటీ నిలబెట్టుకోలేదన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని, ఆయనకు ఓటేస్తే సంక్షేమం ఆగిపోవాలని మీరు నిర్ణయం తీసుకున్నట్లేనన్నారు.

గతంలో సింగపూర్ ను మించి అభివృద్ధి చేస్తానని, ప్రతీ గ్రామంలో ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నారని, జిల్లాకో హైటెక్ సిటీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అన్నారని, కానీ వచ్చాయా అని అడిగారు. కానీ అదే ముగ్గురు మళ్లీ వస్తున్నారని, వారిని నమ్మొద్దన్నారు.

ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లనీ, ఇంటింటికీ వెళ్లి బాబు చేసిన మోసాలు వివరించాలని జగన్ కోరారు. ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగాలంటే జగనన్న రావాలని చెప్పాలని సూచించారు. వాలంటీర్లు తిరిగి మీ ఇంటికి రావాలంటే జగనన్న రావాలన్నారు. జగన్ కు ఓటేయడం అంటే మంచిని కొనసాగించడమే అని జగన్ తెలిపారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎన్డీయే కూటమి పార్టీలను ఓడించాలన్నారు.












Click it and Unblock the Notifications