జగన్ కోసం రంగంలోకి కొత్త వ్యూహకర్త - ఏరి కోరి, మారుతున్న లెక్కలు..!!
ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి పార్టీలు జగన్ లక్ష్యంగా కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. గతంలో చేసిన పొరపాట్లను సరి చేసుకుంటూ.. తిరిగి రాజకీయంగా తన ప్రణాళికలు అమలుకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా కొత్తగా రాజకీయ వ్యూహకర్త ను ఖరారు చేసినట్లు సమాచారం. 2019, 2024 ఎన్నికల్లో వైసీపీ కోసం ఐ ప్యాక్ పని చేసింది. సారధులు మాత్రం మారారు. ఫలితాలు వేర్వేరుగా వచ్చాయి. దీంతో, జగన్ రాజకీయ వ్యూహకర్త ఎంపిక.. తాజా వ్యూహాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
మాజీ సీఎం జగన్ తిరిగి కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాజకీయంగా కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. 2019-24 కాలంలో రాజకీయంగా చేసిన పొరపాట్లను సరి చేసుకుంటూ.. ఈ సారి అధికారంలోకి వస్తే కేడర్ కే తొలి ప్రాధాన్యత ఉంటుందని జగన్ భరోసా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిస్తున్నారు.

తాజా గా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో చేపట్టటాన్ని జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ బలోపేతం.. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు తిరిగి రాజకీయ వ్యూహకర్త నియామకం పైన జగన్ ఫోకస్ చేసారు. 2019 లో ప్రశాంతి కిశోర్ టీం... 2024 లో రుషిరాజ్ సింగ్ టీం జగన్ కోసం పని చేసాయి. కానీ 2019లో గెలిచిన జగన్... 2024 లో ఓడిపోయారు.
2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఢిల్లీ లోని ఒక కీలక నేత జోక్యంతో ప్రశాంత్ కిశోర్ నాడు చంద్రబాబును కలిసారు. ఆ సమయంలో జరిగిన ఒప్పందం మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు హైదరాబాద్ లోనే మకాం వేసి జగన్ ను ఓడించే వ్యూహాలను కూటమికి ప్రశాంత్ కిశోర్ అందించి .. విజయం లో కీలక పాత్ర పోషించారు. మద్యం, లాండ్ టైటిల్ యాక్ట్, పెన్షన్ల పెంపు, వాలంటీర్లకు హామీలు వంటి ఆలోచనలు ప్రశాంత్ కిశోర్ సలహాలుగా టీడీపీ నేతల సమాచారం. కొద్ది నెలల క్రితం లోకేష్ ఢిల్లీ పర్యటనలోనూ ప్రశాంత్ కిశోర్ ను కలిసారు. ప్రస్తుత రాజకీయాల పైన చర్చించి సూచనలు.. సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటు టీడీపీకి 2024 ఎన్నికల ముందు నుంచి పని చేస్తున్న రాబిన్ శర్మ టీం షో టైం కన్సల్టెన్సీ ఇప్పటికీ కొనసాగుతోంది.
ఇక, ఎన్నికల్లో ఓటమి తరువాత ఎక్కువగా బెంగళూరులో ఉంటున్న జగన్.. ఇక రాజకీయంగా తన కార్యాచరణ అమలుకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా ఐ ప్యాక్ లో ప్రశాంత్ కిశోర్ కు సహచరుడిగా పని చేసిన ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్త తో తన పార్టీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. 2029 ఎన్నికల వరకు ఆ వ్యూహకర్త సేవలు అందించేలా నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది.
ఇక దశలో గతంలో పని చేసిన రిషి రాజ్ సింగ్ తిరిగి సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు పార్టీలో ప్రచారం సాగింది. దీని పైన జగన్ ఆసక్తిగా లేరని సమాచారం. ఈ కారణంగానే ఇప్పుడు ఈ సీనియర్ వ్యూహకర్తతో ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం పైన జగన్ పార్టీ ముఖ్యుల కు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. అదే విధంగా జగన్ ఇక పార్టీ కేడర్ - ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇక.. ఈ సమయంలోనే జగన్ తీసుకునే నిర్ణయాల పైన పార్టీలో ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications