Jagananna Vidya Kanuka : జగనన్న విద్యాకానుక కిట్లపై విద్యార్ధులకు బంపర్ ఆఫర్...
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాకానుక పేరుతో ఏటా కిట్లు అందిస్తోంది. ఇందులో పాఠ్యపుస్తకాలతో పాటు స్కూలు బ్యాగ్, యూనిఫామ్, బూట్లు, సాక్సులు, ఇతరత్రా ఉన్నాయి. వీటిని ఏటా విద్యాసంవత్సరం ప్రారంభం సమయంలో అందచేస్తున్నారు. వీటి నాణ్యత విషయంలో ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో విద్యార్ధులకు ఏటా అందిస్తున్న జగనన్న విద్యాకానుకలో భాగంగా ఇస్తున్న బ్యాగులు, బూట్ల నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఇచ్చిన రెండు, మూడునెలలకే ఇవి పాడైపోతున్నట్లు అక్కడక్కడా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో మొత్తం జగనన్న కానుకకే చెడ్డపేరు వస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. నాణ్యతలేకుండా విద్యాకానుక ఇస్తున్నారంటూ విపక్షాలు కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్ధులకు ఓ ఆఫర్ ఇచ్చింది.

ఇకపై జగనన్న విద్యాకానుక కిట్లలో వస్తువులు నాణ్యంగా లేకపోతే, ఇచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే పాడైపోతే ఫిర్యాదులు చేసేందుకు విద్యార్ధులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాట్సాప్, ఫోన్ కాలా ద్వారా వీటిపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
దీంతో విద్యార్ధులు ఇకపై విద్యాకానుక కిట్లలో నాణ్యతను సరి చూసుకుని, సరైన కిట్లు ఇవ్వకపోతే ఫిర్యాదులు చేయడం ద్వారా ప్రభుత్వానికి వాటిని సరిచేసి ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇలా వాట్సాప్ చేసేందుకు 9013133636 నంబర్ ను ఇచ్చారు. అలాగే 14417 నంబర్ కు కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

అదే సమయంలో విద్యాశాఖ అధికారులతో పాటు విద్యాకానుక సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు కూడా ప్రభుత్వం హెచ్చరికలు పంపింది. విద్యాకానుకపై వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు జిల్లా స్ధాయిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే కాంట్రాక్టర్లు నాణ్యతలేని విద్యాకానుక కిట్లు సరఫరా చేస్తే వారిని బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించింది. అలాగే నాణ్యత లేని విద్యాకానుక కిట్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్ల బ్లాక్ లిస్ట్ ను ఇతర రాష్ట్రాలతో పాటు జాతీయ స్ధాయి సంస్ధలకూ పంపుతామని హెచ్చరిస్తోంది.












Click it and Unblock the Notifications