మూడేళ్లు ఆగండి... నేనే సీఎం, జ్యోతిష్కుడు చెప్పారు: జగన్
హైదరాబాద్: సీఎం పదవి అందినట్టే అంది చేజారిపోడవంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ మధ్య కాలంలో జ్యోతిష్యాల పిచ్చి బాగానే పట్టుకున్నట్టుంది. ఇటీవల ఓ బహిరంగ సభలో మట్లాడుతూ మరో రెండేళ్ల పాటే నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉంటారని, ఆ తర్వాత తానే సీఎం అవుతానని చెప్పిన ఆయన తాజాగా మరో ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం వైయస్ జగన్ కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలోని తన ఇంట్లో ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. మరో మూడేళ్లలో తాను సీఎం అవుతానని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మరో మూడేళ్లు ఆగండి. ముఖ్యమంత్రిగా నేనే వస్తా. మీ సమస్యలు తీరుస్తా'' అని ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ వ్యక్తిగత సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తొండూరు ఎమ్మార్సీలో స్వీపర్‌గా పనిచేస్తున్నానని, ఇటీవల తనను తొలగించారని తనకు న్యాయం చేయాలని ఓ మహిళ.. జగన్‌కు విన్నవించుకున్నారు. కోర్టుకు వెళ్లటమే దీనికి ఏకైక మార్గమని ఆయన సూచించారు. కోర్టులో కేసు పరిష్కారానికి కొన్నేళ్లు పడుతుందని.. మూడేళ్లు ఆగితే తానే సీఎం అయి.. అందరి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.
జ్యోతిష్యులు కూడా చంద్రబాబు ప్రభుత్వం ముందే పడిపోతుందని చెబుతున్నారని కూడా జగన్ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ చేపట్టనున్న బంద్ విజయవంతం అయ్యేలా అందరూ కృషిచేయాలని జగన్ కోరారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం శెట్టిపల్లి వద్ద ఎండిపోయిన వేరుశనగ పంటను జగన్ పరిశీలించారు.












Click it and Unblock the Notifications