ఏపీలో పరిశ్రమలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!
ఏపీలో పరిశ్రమలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో విద్యుత్ కొరత నేపథ్యంలో పరిశ్రమలపై ఇస్తున్న విద్యుత్ సరఫరాలో పలు ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పారిశ్రామిక వర్గాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై ప్రభుత్వం సమీక్షించింది. అదే సమయంలో రాష్ట్రంలో కరెంటు డిమాండ్ కూడా తగ్గడంతో పవర్ హాలిడే ను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో పరిశ్రమలకు పవర్ హాలిడే విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ రెండు రోజులుగా రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల వాతావరణం చల్లబడింది. దీంతో సహజంగానే విద్యుత్ డిమాండ్ గణనీయంగా తగ్గింది. కాబట్టి గ్రిడ్ పై ఒత్తిడి కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిశ్రమలకు విధించాలని భావించిన పవర్ హాలిడేను ఉపసంహరించుకుంది.

ఈ మేరకు ఇవాళ విజయవాడ విద్యుత్ సౌధలో ట్రాన్స్ కో, జెన్ కో, ఏపీపీసీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ట్రాన్స్ కో ఎండీ విజయానంద్ కీలక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలో పవర్ హాలిడే లేదని, పరిశ్రమలపై ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పరిశ్రమ వర్గాలకు ఊరట లభించినట్లయింది. రాష్ట్రంలో విద్యుత్ కొరత నేపథ్యంలో గృహ, వ్యవసాయ అవసరాలకు విద్యుత్ కేటాయించి పరిశ్రమలకు కోత పెట్టాలని ప్రభుత్వం గత నెలలో నిర్ణయించింది.
దీని ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు గృహ, వ్యవసాయ అవసరాలకు కేటాయించి పరిశ్రమలకు కోత పెట్టేందుకు డిస్కంలు ప్రతిపాదనలు పంపాయని విజయానంద్ తెలిపారు. దీంతో ఈ నెల 5వ తేదీ నుంచి పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించేందుకు ట్రాన్స్ కో సిద్ధమైంది. అయితే మారిన పరిస్ధితుల్లో ప్రభుత్వం ఆ నిర్ణయం ఉపసంహరించుకోవడంతో పరిశ్రమలకు యథావిధిగా విద్యుత్ సరఫరా కాబోతోంది.












Click it and Unblock the Notifications