ఫీజులపై సర్కార్ లెక్క తప్పు?-కాగ్ రిపోర్ట్ బయటపెట్టిన జగన్..!
అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చంద్రబాబు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకని నిలదీశారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన లెక్కలపై జగన్ ప్రశ్నలు సంధించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 2024-25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు చెప్తున్నారని, కానీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొందన్నారు. అయితే ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్ నిర్ధారించిందన్నారు. ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్ లెక్కలే అన్నారు.

అలాగే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారని, కానీ రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు చూపించారన్నారు. బడ్జెట్ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారని, అదీ పాత సంవత్సరానికి అని అడిగారు. అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయన్నారు. మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారని, మీరు సవరించిన బడ్జెట్ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయన్నారు.
అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారని, ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్ నెల కూడా రాలేదని గుర్తుచేశారు. అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారన్నారు. ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారని అడిగారు. వారికి చెల్లింపులు ఎలా చేశారని నిలదీశారు.

ఎన్నికల కోడ్ కారణంగానే 2023-24 చివరి త్రైమాసికానికి వైసీపీ ప్రభుత్వం అప్పట్లో చెల్లింపులు చేయలేదన్నారు.
అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లమన్నారు. మరి 2019లో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి? అని జగన్ ప్రశ్నించారు. అప్పట్లో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు తమ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ఇక వసతి దీవెన గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డటం లేదన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు 9100 కోట్లు ప్లస్ 3300 కోట్లు కలిపి 12400 కోట్లు బకాయిపడ్డారన్నారు. ఇందులో చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే అన్నారు. మిగిలిన 9600 కోట్లు వెంటనే చెల్లించాలన్నారు.














Click it and Unblock the Notifications
