జగన్‌కు అఖిలేష్ రెండో'సారీ' షాక్: బాబుకు విజయమ్మ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర ప్రదేశ్ లక్నో పర్యటన రద్దయింది. ఈ రోజు సాయంత్రం ఆయన లక్నోకు వెళ్లి యుపి ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను కలవాల్సి ఉంది. కానీ పర్యటన రద్దయింది. అఖిలేష్ అపాయింటుమెంట్ నిరాకరించడంతోనే జగన్ పర్యటన రద్దయిందని వార్తలు వస్తున్నాయి. అఖిలేష్ రెండోసారి జగన్‌కు షాకిచ్చారంటున్నారు.
విజయమ్మ దీక్ష
కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పును నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం నుండి మూడురోజుల పాటు ప్రాజెక్టుల వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఈ నెల 4న పులిచింతల, 5న గండికోట, 6న జూరాల ప్రాజెక్టుల వద్ద విజయమ్మ ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు ధర్నా చేపట్టనుంది. కాగా, బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పుపై ప్రకాశం బ్యారేజీ వద్ద దీక్ష చేయాలని రెండురోజుల క్రితం నిర్ణయించుకున్నారు. దానికి కౌంటర్‌గా విజయమ్మ మూడు రోజుల దీక్షను చేపడుతున్నారంటున్నారు.

చంద్రబాబుపై జగన్ పార్టీ ఫైర్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుర్నాథ్ రెడ్డి, గట్టు రామచంద్ర రావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలకు సంబంధించి జరిగిన అన్యాయంపై బాబు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టిడిపి వైయస్ పైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
2000వ సంవత్సరంలోనే మిగులు జలాలపై హక్కు లేదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందన్న విషయాన్ని గుర్తు చేశారు. దీనికి చంద్రబాబు బాధ్యులు కాదా అని ప్రశ్నించారు. బచావత్ అవార్డు నుంచి బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పు వరకు బాబు చర్చకు రావాలన్నారు. నాడు ఎన్టీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల టెండర్లు కూడా బాబు రద్దు చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని విమర్శించారు. అల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచింది బాబు హయాంలోనే అన్నారు.












Click it and Unblock the Notifications