ఏపీలో పర్యాటక ప్రాంతాలు మరింత సేఫ్-20 ప్రత్యేక పీఎస్ లు ప్రారంభం-జగన్ కీలక వ్యాఖ్యలు..
ఏపీలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి భద్రత కోసం 20 ప్రత్యేక పోలీసు స్టేషన్లను సీఎం జగన్ ఇవాళ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఏపీలో పర్యాటక ప్రాంతాలు మరింత సురక్షితం కానున్నాయి. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను సీఎం వైయస్.జగన్ ఇవాళ వర్చువల్‌గా క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, పోలీసు శాఖలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా, గతానికి భిన్నంగా ఎన్నో మంచి సంస్కరణలు అమలవుతున్నాయని సీఎం జగన్ తెలిపారు. ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్ధాయిలోనే మహిళా పోలీసులు, గ్రామ సచివాలయాల ద్వారా అందుబాటులోకి వచ్చారన్నారు. ఎప్పుడూ జరగని విధంగా జీరో ఎఫ్‌ఐఆర్‌ని.. మొట్టమొదటగా రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లినప్పుడు అక్కడ ప్రవర్తించే విధానంలో గతానికి ఇప్పటికీ గణనీయమైన తేడా కనిపించే విధంగా మార్పు తీసుకునివచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. పోలీసులు మీ స్నేహితులు అనే భావనను కలిగిస్తూ.. పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టును కూడా ఏర్పాటు చేసి...ఫిర్యాదుదారులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తున్నామని జగన్ వెల్లడించారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా దిశ యాప్‌ను దాదాపు 1 కోటి 20 లక్షల పై చిలుకు రిజిస్ట్రేషన్లు, డౌన్లోడ్ చేసుకున్నారని, ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ను ఐదు సార్లు షేక్ చే సినా, ఎస్‌ఓఎస్ బటన్ నొక్కినా చాలు... ఐదు, పదినిమిషాలలోపే పోలీసు సోదరుడు ఒక అన్నగా, తమ్ముడిగా వచ్చి సహాయం చేయడానికి స్పందిస్తారని ఫోన్ చేసి సమాచారం అడుగుతారని తెలిపారు. ఒకవేళ ఫోన్‌లో స్పందించకపోతే స్వయంగా అక్కడికి వెళ్లి తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తున్నారన్నారు.
ఇవాళ 20 పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, గతంలో ఎప్పుడూ జరగని, చూడని విధంగా ఇవాళ జరుగుతున్నాయని సీఎం జగన్ తెలిపారు. పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే వారి భద్రత కోసం ప్రత్యేకంగా దాదాపు 20 లొకేషన్లు గుర్తించి అక్కడ కియోస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. .ఆ కియోస్క్‌లన్నీ స్ధానిక పోలీస్ స్టేషన్‌కు అనుసంధానమై, 20 అదనపు పోలీస్ స్టేషన్‌లుగా పనిచేస్తున్నాయన్నారు. ప్రతి కియోస్క్‌లోనూ దాదాపుగా 6 మంది సిబ్బంది రెండు షిప్టులలో పనిచేసే విధంగా రూపకల్పన చేశారన్నారు. వీరిని ఎస్‌ఐ లేదా ఏఎస్‌ఐ స్ధాయి అధికారి పర్యవేక్షిస్తారు. ఎవరైనా ఆపదలో ఉంటే వారి కోసం ప్రత్యేకంగా టెలిఫోన్ నంబరు డిస్‌ప్లే చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు.ఆ ప్రదేశంలో ఎవరికైనా ఆపద వస్తే... దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పోలీసు సోదరుడు మీకు తోడుగా నిలబడినట్టే అన్న భావన కల్పించే విధంగా కరపత్రాలు కూడా ఆ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని జగన్ తెలిపారు.

వీరందరికీ ప్రత్యేకమైన టెలిఫోన్ నెంబరు, రేడియో సెట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాపు, అత్యవసర టెలిఫోన్ నెంబర్లు, వాహనాలు ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్న పర్యాటకులు, యాత్రికులు నిర్భయంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జగన్ తెలిపారు. తద్వారా పర్యాటక ప్రాంతాల్లోనూ, ఆధ్యాత్మిక ప్రాంతాల్లోనూ నిర్భయంగా గడిపేందుకు అవసరమైన భరోసా కల్పించే దిశగా ఇకమీదట ఈ టూరిస్ట్ పోలీసు స్టేషన్లు పనిచేయడం మొదలు పెడతాయన్నారు. ఇవన్నీ మహిళల భద్రతతో పాటు ఆ ప్రాంతంలో పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం రాకూడదన్న తపనతో అడుగులు ముందుకు వేశామన్నారు. పోలీసుశాఖలో ఇది మరో సువర్ణఅధ్యాయంగా కూడా నిలబడుతుందని, పోలీస్ శాఖలో చేస్తున్న అనేక సంస్కరణల్లో ఇది కూడా గొప్ప సంస్కరణగా నిలబడుతుందన్నారు.












Click it and Unblock the Notifications