మీ ఉద్యోగం పోదు, జాబ్ నుంచి తీసేస్తే వాళ్లకుంటదీ..: జగన్ హెచ్చరిక
విశాఖ: ఇక్కడకు వచ్చి సమస్యలు చెబితే, ఉద్యోగాల నుంచి తీసేస్తే ఇక వాళ్లకు ఉంటది... అని వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. ఆయన మధ్యాహ్నం బ్రాండిక్స్ కార్మికులకు మద్దతు పలికి మాట్లాడారు.
ఇక్కడ ఉద్యోగులు ఎవరైనా వచ్చి సమస్యలు చెప్పవచ్చునని, అలా వచ్చి చెబితే ఎవరి ఉద్యోగాలు పోవని చెప్పారు. ఉద్యోగాల నుంచి తీసేస్తే ఇక వాళ్లకు ఉంటది.. అని, ఇది ప్రజాస్వామ్య దేశమన్నారు. ఉద్యోగాలు తీసేసే పరిస్థితి రాదనుకుంటున్నానని చెప్పారు. అలా చేస్తే, దారుణం, అన్యాయం అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ... కార్మికుల కష్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వంతో బ్రాండిక్స్ యాజమాన్యం కుమ్మక్కయిందని ఆరోపించారు. అమెరికాలో అయితే గంట పని చేస్తే నాలుగు వేలు రూపాయలు సంపాదించవచ్చునని చెప్పారు.

పేజ్ బోర్డు ప్రకారం ఐదేళ్లకోసారి వేతనాలు పెంచాలన్నారు. బ్రాండిక్స్ లాభాల్లో నడుస్తున్నా, కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. బ్రాండిక్స్ కంపెనీకి వైయస్ రాజశేఖర రెడ్డి అనుమతులు ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వం రాయితీలు పొందుతూ కూడా కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు.
ఉద్యోగాలు అనారోగ్యంతో ఉన్నా కూడా టార్గెట్లు ఇచ్చి వేధిస్తున్నారన్నారు. ధర్నా చేస్తే ఆడవాళ్ల పైన ప్రతాపం చూపిస్తారా అని ధ్వజమెత్తారు. ఏప్రిల్ 15న ఆందోళన చేస్తే జీతాలు పెంచుతామని చెప్పారని, ఏప్రిల్ 30న ధర్నా చేస్తే లాఠీఛార్జ్ చేశారని తెలిసిందన్నారు.

రెండు పూటలా తిని కనీసం సాధారణ జీవితం గడపాలన్నా రూ.పదివేల జీవితం కావాలని కార్మికులు కోరుతున్నారన్నారు. అమెరికాలో నెలకు లక్షలాది రూపాయలు వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను జగన్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

పలువురు మహిళా ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నాక జగన్ మళ్లీ మాట్లాడుతూ.. ఇక్కడకు వచ్చి మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. వారి న్యాయబద్దమైన సమస్యలు పరిష్కరించాలన్నారు. రూ.నాలుగు వేల జీతం ఎటూ సరిపోదన్నారు. కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్మికుల సమస్యలపై కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications