ప్రాణం పోతుందనే భయం లేదు, జైట్లీని అడుగుతున్నా, సిగ్గుందా: వెంకయ్యపై జగన్

విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీల పైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో వైసిపి నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభలో ప్రసంగించారు.

ప్రాణాలు పోతాయనే భయం లేదు, వేచి చూస్తాం

ప్రాణాలు పోతాయన్న భయం లేదని, ఉద్యమాలు అంటే భయపడేది లేదని, మన పిల్లల కోసం ఉద్యమాన్ని ఏ స్థాయికి అయినా తీసుకెళ్తామన్నారు. ప్రతి చోట సభలు పెడతామన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలలో నిలదీస్తామన్నారు. పార్లమెంటు శీతాకాల, బడ్జెట్ సమావేశాలు అయ్యే దాకా చూస్తామని, అప్పుడు మన ఎంపీలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్తామన్నారు.

అప్పుడు మనకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం మొత్తం వినేలా చేద్దామన్నారు. అప్పటికి వినకుంటే 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదానే రిఫరెండంగా మార్చే విధంగా చేస్తామన్నారు. ఏ జాతీయ పార్టీ అయినా ఏపీకి వచ్చి ఓట్లు అడగాలంటే హోదా ఇస్తామని మాట ఇచ్చాకే మాట్లాడే పరిస్థితి తీసుకు వస్తామన్నారు.

జైట్లీని అడుగుతున్నా

ఇటీవలే విజయవాడలో జైట్లీ మాట్లాడారని, ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఏపీకి 25 సంస్థలు ఇచ్చామని చెప్పారని, కానీ నేను జైట్లీని ఓ మాట అడుగుతున్నానని జగన్ అన్నారు. కోటి జనాభా ఉన్న ఏ రాష్ట్రంలో ఈ సంస్థలు లేవన్నారు. నిట్, ఐఐటీ, సెంట్రల్ వర్సిటీలు దాదాపు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయన్నారు. అలాంటప్పుడు మీరు ఏపీకి ఏం మేలు చేస్తున్నారన్నారు. మీరు మాకు ఏదో దానం, బిచ్చం ఏస్తున్నట్లు రోజూ చెప్పడానికి మీకు మనసు ఎలా వస్తుందని ప్రశ్నించారు.

గుజరాత్‌కు ఇటీవలే రైల్వే వర్సిటీ ఇచ్చారని, ఏ యాక్టు ప్రకారం ఇచ్చారో చెప్పాలన్నారు. యాక్టులో ఉన్న విశాఖకు ఎందుకు రైల్వే జోన్ ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. యాక్టులో ఉన్న పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఎందుకు కట్టడం లేదని ప్రశ్నించారు. సమైక్య ఏపీలో హైదరాబాదులో సంస్థలన్నీ ఏర్పాటు చేశారని, ఇప్పుడు విభజన నేపథ్యంలో ఏపీకి కొన్ని ఇస్తున్నారన్నారు.

సిగ్గులేకుండా.. వెంకయ్యపై జగన్ ఆగ్రహం

నాడు హైదరాబాదులో ఎన్నో సంస్థలు పెట్టారని, ఏ యాక్ట్ ప్రకారం పెట్టారని ప్రశ్నించారు. సిగ్గులేకుండా నలభై ఏళ్ల నుంచి ఇవ్వని వాటిని ఇచ్చామని చెబుతున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును ఉద్దేశించి అన్నారు. నలభై ఏళ్లలో ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఏపీకి ఇచ్చామని వెంకయ్య, ఇతర బీజేపీ నేతలు అన్నారు. ప్యాకేజీ పేరుతో రోజు అబద్దాలు, బోగస్ ప్రచారాలు చేస్తున్నారన్నారు.

అబద్దాలు చెబుతూ పుండు మీద కారం చల్లుతున్నారన్నారు. జైట్లీ, వెంకయ్య, చంద్రబాబులు ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా నిధులు ఇచ్చామని చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకంగా చేసిన సాయం ఏదీ లేదని, అందరితో పాటు మనకు ఇచ్చారన్నారు.

చంద్రబాబు సుందర ముఖం చూసి రావు

ఈ మధ్య జైట్లీ, చంద్రబాబు, వెంకయ్యలు మరో అబద్దం ఆడుతున్నారన్నారు. హోదా వల్ల ఏపీకి 90 శాతం నిధులు, 10 శాతం బెనిఫిట్స్ వస్తాయని చెబుతున్నారని, కానీ హోదా కలిగిన రాష్ట్రాలకు వంద శాతం ఎక్సైజ్ డ్యూటీ ఎక్సంప్షన్ తదితరాలు ఉన్నాయన్నారు. హోదా ఉన్న రాష్ట్రాలకు కాకుండా ఇతర రాష్ట్రాలకు అలాంటి ఇన్సెంటివ్‌లు వచ్చాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు విమానాల్లో అమెరికాకు తిరిగితే పరిశ్రమలు రావన్నారు. హోదా, తద్వారా రాయితీలతోనే పరిశ్రమలు వస్తాయన్నారు. బాబు సుందర మొహం చూసి ఎవరూ రారన్నారు. హోదా సంజీవిని కాకుంటే రెండుసార్లు ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేపించారో చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+