వైసీపీ దూకుడు వెనుక ? మంత్రులకు జగన్ సంకేతం- అమలు చేస్తున్న క్యాడర్-వర్కవుట్ అయ్యేనా ?
ఏపీలో అధికార వైసీపీ ఎన్నడూ లేనంత దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా విపక్ష టీడీపీని లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఎన్నికల రాజకీయాలకు పదునుపెడుతోంది. టీడీపీలో పట్టాభి వంటి నేతను, ఆయన చేసిన వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకుని వైసీపీ చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే తలపండిన రాజకీయ ఉద్దండులు సైతం ఆశ్చర్యపోతున్నారు. దీనికి గల కారణాలపై అన్వేషణ ప్రారంభించారు. అయితే తాజాగా సీఎం జగన్ కేబినెట్ భేటీలో మంత్రులకు ఇచ్చిన సంకేతమే వైసీపీ దూకుడు వెనుక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

వైసీపీ దూకుడు పాలిటిక్స్
ఏపీలో వైసీపీ ప్రస్ధానం మొదలై పుష్కరం కావస్తోంది. ఒకప్పుడు సానుభూతి రాజకీయాల్నే నమ్ముకున్న వైసీపీ ఇప్పుడు దూకుడు రాజకీయాలకు తెర దీస్తోంది. ముఖ్యంగా అధికార పీఠం చేతిలో ఉండటంతో ఈ రాజకీయాల్ని సమర్ధంగా క్షేత్రస్ధాయిలో అమలు చేస్తోంది. ఇందులో పోలీసు యంత్రాంగం, ఇతర అధికారులు కూడా ఆటోమేటిగ్గా భాగస్వాములైపోతున్నారు. దీంతో రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీ కేంద్రంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ వేసే ప్రతీ అడుగూ చర్చనీయాంశమయ్యే పరిస్ధితి. అది చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ వెళ్లడం కావచ్చు, టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణుల దాడులు కావొచ్చు, పట్టాభి అరెస్టు కావొచ్చు వైసీపీ మార్క్ మాత్రం కనిపిస్తోంది.

టీడీపీ నుంచి ఊహించని ప్రతిఘటన
వైసీపీ దూకుడు రాజకీయాల వెనుక టీడీపీ నుంచి ఈ రెండేళ్లలో ఎదురైన ప్రతిఘటనే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే పరిమితం కావడంతో ఇక ఆ పార్టీ పనైపోయిందని భావించిన వైసీపీకి అనతి కాలంలోనే టీడీపీ బలం తెలిసొచ్చింది. ముఖ్యంగా సొంత కుల మీడియా సాయంతో టీడీపీ చెలరేగిపోతున్న తీరు వైసీపీకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు కూడా చేతిలో లేకపోయినా చంద్రబాబు ఆడుతున్న రాజకీయ క్రీడ ఇప్పుడు దాదాపు 155 మంది ఎమ్మెల్యేలు చేతిలో ఉన్న అధికార పార్టీ వైసీపీని తీవ్రంగా ఇరుకునపెడుతోంది. దీంతో వైసీపీ ఇప్పుడు తప్పనిసరిగా గేరు మార్చాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.

పరిస్ధితి గ్రహించిన జగన్
ఏపీలో రెండేళ్ల క్రితం భారీ మెజారిటీతో అధికారం కైవసం చేసుకుని, భారీ ఎత్తున అప్పులు చేసి మరీ సంక్షేమ అజెండాను పట్టాలు తప్పకుండా అమలు చేస్తున్న వైఎస్ జగన్. కు టీడీపీ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన నేపథ్యంలో ఇవన్నీ చిన్న విషయాలుగా మారిపోతున్నాయి. ఎవరేమనుకున్నా జగన్ కు ఇప్పుడు టీడీపీ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన కచ్చితంగా కలవరపెడుతోంది. దీంతో పరిస్ధితిని గ్రహించిన జగన్.. బీజేపీ, టీడీపీ, జనసేన ఇలా ఏ విపక్ష పార్టీని తేలిగ్గా తీసుకోలేని పరిస్దితి వచ్చేసింది. వాస్తవానికి విపక్షాలన్నింటికీ కలిపి ప్రస్తుతం ఉన్న వాస్తవ ఎమ్మెల్యేల బలం 20 కూడా మించట్లేదు. అయినా 156 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న జగన్.. వీరిని ఎదుర్కొనేందుకు శ్రమించాల్సి వస్తోంది.

మంత్రులకు జగన్ దిశానిర్దేశం
రాష్ట్రంలో ప్రజలు ఐదేళ్ల కాలానికి తమకు అధికారం అప్పగించినా.. రెండేళ్లలోనే మారిపోయిన పరిస్ధితిని జగన్ త్వరగానే గ్రహించారు. దీంతో విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని ఎప్పటికప్పుడు కేబినెట్ భేటీల్లోనే మంత్రులకు సూచిస్తున్నారు. తాజాగా జరిగిన రెండు కేబినెట్ భేటీలే ఇందుకు నిదర్శనం. ఓ కేబినెట్ భేటీలో బీజేపీ విమర్శలకు మంత్రులు దీటుగా సమాధానం చెప్పాలని, బీజేపీని కూడా ఇతర విపక్షాల్లాగే చూడాలని సూచించిన జగన్.. మరో కేబినెట్ భేటీలో వచ్చే ఏడాది నుంచి జనాల్లోకి వెళ్లి విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. దీంతో మంత్రులు వెంటనే రంగంలోకి దిగిపోయారు.

టీడీపీపై మొదలైన దాడులు
జగన్ ఇలా కేబినెట్ భేటీలో చెప్పారో లేదో అలా వైసీపీ నేతలు గేరుమార్చడం మొదలుపెట్టేశారు. అసలే అధికార పార్టీగా ఉన్న అనుకూలతలు, పోలీసు బలం, అంగబలం, అర్ధబలం.. ఇలా అన్నింటినీ రంగరించి విపక్షాన్ని కకావికలం చేసే పని ప్రారంభించేశారు. అయ్యన్నపాత్రుడు విమర్శలకు స్పందించి చంద్రబాబు ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వెళ్లడం, తాజాగా పట్టాభి వ్యాఖ్యలకు టీడీపీ కార్యాలయాలన్నింటిపైనా ఒకేసారి దాడులకు దిగడం ఇందులో భాగమేనని చెప్తున్నారు. దీంతో మారిన పరిస్ధితుల్లో టీడీపీపై వైసీపీ నేతల దూకుడు ఏ స్ధాయిలో ఉందో ఇట్టే అర్ధమవుతుంది.

వైసీపీకి వర్కవుట్ అవుతుందా ?
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితుల్లో విపక్ష టీడీపీని ఓవైపు కేసులు, మరోవైపు దాడులతో భయ భ్రాంతులు చేయడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళ్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు ఏం మాట్లాడినా, నిరసనలు చేపట్టినా పోలీసులు అట్రాసిటీ కేసులు పెట్టేస్తున్నారు. అదే సమయంలో తాజాగా టీడీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు నేరుగా భౌతిక దాడులకు దిగుతున్నాయి. గతంలో చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేష్ వెళ్లినప్పుడు విమర్శలు రావడంతో ఈసారి శ్రేణుల్ని రంగంలోకి దించారు. మీరు దాడులు చేయండి, మేం చూసుకుంటాం అనేలా వైసీపీ శ్రేణుల్ని ప్రభుత్వం, పోలీసులు ప్రోత్సహిస్తున్నారన్న విమర్సలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఏపీ ప్రజలకు అలవాటు లేని ఈ దూకుడు రాజకీయం వర్కవుట్ అవుతుందా లేదా అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications