జగన్ కు విపక్ష హోదాపై ట్విస్ట్-హైకోర్టు కీలక నిర్ణయం.. !
ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే సాధించిన వైసీపీకి ప్రధాన విపక్షంగా గుర్తింపు, పార్టీ అధినేత వైఎస్ జగన్ కు విపక్ష నేత హోదా కల్పించే వ్యవహారంలో ఇవాళ మరో ట్విస్ట్ ఎదురైంది. విపక్ష హోదా కల్పించేందుకు తగినన్ని సీట్లు రాకపోవడంతో ఇవ్వలేమంటూ గతంలో స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ఆధారంగా జగన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీకి ప్రధాన విపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభా వ్యవహారాలమంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్నకుమార్ కు నోటీసులు ఇచ్చింది. జగన్ పిటిషన్ పై తమ అభిప్రాయాలు చెప్పాలని వీరిని కోరింది. అలాగే జగన్ గతంలో వేసిన మరో పిటిషన్ ను కూడా దీనికి జత చేయాలని ఆదేశించింది.

గతంలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ జగన్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన స్పీకర్.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెలా ఇస్తామని ప్రశ్నించారు. జగన్ కు విపక్ష నేత హోదా ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవని తేల్చిచెప్పేశారు. ఈ మేరకు రూలింగ్ కూడా ఇచ్చారు. దీనిపై జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఇవాళ మరోసారి విచారణకు వచ్చింది. దీంతో స్పీకర్ తో పాటు ముగ్గురు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
ఇప్పటికే విపక్ష నేత హోదా ఇవ్వడం లేదనే కారణం చూపి జగన్ అసెంబ్లీకి రావడమే మానేశారు. అలాగే జగన్ రాకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావడం లేదు. ఈసారి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని, వారికి తగినంత సమయం ఇస్తామని స్పీకర్, మంత్రులు కోరినా వారు మాత్రం స్పందించలేదు. చివరికి అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తామని కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామ హెచ్చరికలు చేస్తున్నారు. అయినా వైసీపీ మాత్రం ప్రభుత్వం తదుపరి వ్యూహం కోసం ఎదురుచూస్తోంది.












Click it and Unblock the Notifications