వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖ ఇదే- బయటపెట్టిన వైసీపీ..!
ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై జగన్ ఓవైపు సుప్రీంకోర్టు, ఈసీ వద్ద పోరాటాలు చేస్తున్న వేళ.. ఆయన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు.. వీటిని పక్కదోవ పట్టించడానికి వ్యక్తిగత విమర్శలకు దిగడంపై వైఎస్సార్సీపీ స్పందించింది. వాస్తవాలను కప్పిపుచ్చుతూ తమ పార్టీ అధ్యక్షుడిపై చంద్రబాబు విషం చిమ్ముతున్న నేపథ్యంలో .. తన మేనకోడలు పెళ్లికి బెంగళూరులోని ఇంటిని ఎందుకు ఇచ్చేందుకు నిరాకరించారో వివరిస్తు సోదరి షర్మిలకు రాసిన లేఖను వైఎస్సార్సీపీ విడుదల చేసింది. జగన్-షర్మిల మధ్య వివాదంగా (YS Jagan-Sharmila Row) మారిన ఈ అంశంలో వాస్తవాల్ని ఇందులో వివరించారు.
ప్రియమైన షర్మి అంటూ జగన్ ఈ లేఖను ప్రారంభించారు. "అంజలి పెళ్లి గురించి తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. గత ఏడేళ్లుగా మన మధ్య ఎన్ని పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, ఆమె జీవితాంతం సంతోషంగా, ప్రేమానురాగాలతో జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నా అభ్యంతరాలను పట్టించుకోకుండా, బెంగళూరులోని నా నివాసంలోనే పెళ్లి నిర్వహించాలని నువ్వు ఇప్పటికీ భావిస్తున్నట్లు నాకు తెలిసింది. నేను నివసిస్తున్న ప్రాంగణంలో పెళ్లి నిర్వహించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని, దాని ప్రభావం వివిధ రకాలుగా ఉంటుందని దయచేసి అర్థం చేసుకో. ఇలాంటి పెళ్లి వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు. క్యాటరింగ్ సిబ్బంది, పూల అలంకరణ బృందాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, అతిథులు ఇలా అనేక మంది ఆస్తిలోకి వచ్చి వెళ్తుంటారు. వీరిలో చాలామంది మనకు తెలియని వారే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి ప్రాంగణానికి, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వెళ్లడం తీవ్రమైన భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తుంది" అని జగన్ ఈ లేఖలో తెలిపారు.

"ఈ నిర్ణయం తీసుకోవడం నాకు కూడా సులభం కాలేదు. అంజిలిని చిన్నప్పటి నుంచి పెరుగుతూ చూడటంతో, ఆమెకు మంచి జరగాలని మాత్రమే కోరుకుంటున్నాను. అయినప్పటికీ భద్రత, గోప్యతకు సంబంధించిన ప్రమాదాలను విస్మరించలేం. హర్ష లేదా వర్ష పెళ్లి విషయంలోనూ నేను ఇదే నిర్ణయం తీసుకునేవాడిని. ప్రస్తుతం నేను ఇక్కడ నివసిస్తున్నాను. ఇలాంటి వేడుక నిర్వహించడం వల్ల అనవసరమైన దృష్టి పడటంతో పాటు భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. చివరికి ఇది నా ఇల్లు. ఇక్కడ నేను, నా కుటుంబం సురక్షితంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాను." అని సోదరికి జగన్ వివరించారు.

అలాగే "గోప్యత, భద్రతకు సంబంధించిన వాస్తవమైన ప్రమాదాలను వివిధ వ్యక్తుల ద్వారా నీకు వివరించినప్పటికీ, నా అభ్యంతరాలను, ఆందోళనలను పట్టించుకోకుండా నువ్వు ముందుకు వెళ్లడం నాకు బాధ కలిగించింది. మరోసారి, ఈ విషయంలో నా పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పెళ్లికి మరో వేదికను ఎంపిక చేసుకోవాలని కోరుతున్నాను. రాజా పెళ్లి కోసం నువ్వు కన్వెన్షన్ సెంటర్‌ను లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికను ఎంచుకోకపోయినా, నేను నా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ ఆస్తిని ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించాను. ఆ ఆఫర్ ఇప్పటికీ అలాగే ఉంది. అంజిలి పెళ్లి ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైన, మధురమైన జ్ఞాపకంగా మిగలాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. అందుకోసం నా వంతుగా సాధ్యమైన ప్రతి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఈ విషయంలో నా దృక్కోణాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను." అంటూ జగన్ ముగించారు.














Click it and Unblock the Notifications
