చంద్రబాబు ఏం సాధించాలనుకుంటున్నారు?
Chandrababu: కడప జిల్లా బద్వేలు సమీపంలోని గోపవరంలో అత్యాచారానికి గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని మరణించింది. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున మృతి చెందింది. ఆమెను కాపాడటానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అత్యాధునిక చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదు.
జగన్ ఆవేదన..
ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఇదేమి రాజ్యం అంటూ మండిపడ్డారు. మహిళలకు, బాలికలకు చంద్రబాబు ప్రభుత్వం కనీస రక్షణ కూడా ఇవ్వలేకపోతోందని, ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో చోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని చెప్పారు.

దుర్మార్గపు చర్య..
బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి, నిప్పు పెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయమైనదిగా, దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు వైఎస్ జగన్. బాధితురాలి కుటుంబానికి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉందని జగన్ విమర్శించారు. ఒక పాలకుడు ఉంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని ఆరోపించారు.
లా అండ్ ఆర్డర్‌పై
వైఎస్ఆర్సీపీ మీద కక్షతో గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, కార్యక్రమాలను ఎత్తి వేస్తూ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు కక్షసాధిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసాను ఇస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక దిశ కార్యక్రమాన్ని ఉద్దేశపూరకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనమని చెప్పారు.
దిశ యాప్ ఏమైంది?
దీనివల్ల మహిళలు, బాలికల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. దిశ యాప్‌లో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను అటూ, ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూం, అక్కడి నుంచి దగ్గర్లోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుందని, వెంటనే పోలీసులు ఆపదలో ఉన్నవారికి ఫోన్ చేస్తారని గుర్తుచేశారు.
నీరుగారిన వ్యవస్థ..
ఆ సమయంలో వారు ఫోన్ ఎత్తక పోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్‌లో చెప్పినా ఘటనా స్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను తాము రూపొందించామని, తమపై కక్ష కొద్దీ ఉద్దేశపూరకంగా దిశ వ్యవస్థను నీరు గార్చలేదా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు జగన్.
లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం @ncbn గారూ? మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2024
వైసీపీపై కక్షతోనే
దిశ అమలులోకి వచ్చినప్పటి నుంచీ 31,607 మహిళలు, బాలికలు రక్షణ పొందారని దాన్ని ఎందుకు దెబ్బతీశారని, 1.56 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న దిశ పై రాజకీయ కక్ష ఎందుకు అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.
దిశ వ్యవస్థ..
దిశ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని, ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించామని గుర్తు చేశారు. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను దిశ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించామని, పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచామని చెప్పారు.
ఎంతో చేశాం..
18 దిశ పోలీస్‌స్టేషన్లను పెట్టి, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చామని, వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశామని వివరించారు. తమ హయాంలో శాంతిభద్రతలు, దిశ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వాళ్లమని, ఫలితంగా పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారని జగన్ అన్నారు.
అన్నీ నిర్వీర్యం..
చంద్రబాబు వాటన్నింటినీ నిర్వీర్యం చేశారని, దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మహిళల రక్షణ, సాధికారత కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, స్కీంలను ఎత్తివేసి, ఇప్పుడు ఇసుక, లిక్కర్ లాంటి స్కాంలకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహిస్తోన్నారంటూ జగన్ ధ్వజమెత్తారు.
పోలీసు వ్యవస్థపైనా..
ఇటు పోలీసు వ్యవస్థ కూడా అధికార పార్టీ పెద్దలకు అడుగులకు మడుగులొత్తుతోందని, ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది తప్ప మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను పట్టించుకోవడంలేదని జగన్ విమర్శించారు.












Click it and Unblock the Notifications