YS Jagan : ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న జగన్ ! ఇక ఎమ్మెల్యేలకూ షేర్ ! ఆ విమర్శలకు చెక్!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం రాష్ట్రంలో కోట్లాది మందిపై ప్రభావం చూపుతోంది. ఇందులో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్దిదారుల నుంచి మొదలుపెట్టి రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల వరకూ అందరూ ఇందులో ఉన్నారు. అయితే వీరిలో లబ్దిదారులు ఈ నిర్ణయంపై సంతోషంగా ఉంటున్నారు. కానీ ప్రజాప్రతినిధులు మాత్రం గుర్రుగా ఉంటున్నారు. దీంతో ఈ అసంతృప్తిని గమనించిన జగన్ ఎన్నికల వేళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

జగన్ నిర్ణయం ఎఫెక్ట్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ గత ప్రభుత్వాలకు భిన్నంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా వాటి ప్రయోజనం అంతిమ లబ్దిదారులకు మాత్రం పూర్తిస్దాయిలో అందకపోవడానికి కారణమైన అందరినీ ఫిల్టర్ చేసేశారు.
ప్రజాప్రతినిధులతో ఎలాంటి సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను క్యాంప్ ఆఫీసులోనే కూర్చుని ఒక్క బటన్ క్లిక్ తో లబ్దిదారులకు అందేలా చేశారు. దీంతో ప్రజాప్రతినిధులకు పెద్దగా పనిలేకుండా పోయింది. లబ్దిదారుల్లో మాత్రం సంతోషం వెల్లివిరుస్తోంది.

లబ్దిదారులకు తప్పిన తిప్పలు
వైఎస్ జగన్ క్యాంపు ఆఫీసులో కూర్చుని సింపుల్ గా బటన్ నొక్కి వేల కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లోకి గంటల వ్యవధిలోనే పంపేస్తుండటంతో వాటిని అందుకుంటున్నవారు సంతోషంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వాల హయాంలో ప్రజాప్రతినిధుల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా సరే అందుతాయో లేవో తెలియని పథకాల డబ్బులు ఈ మూడున్నరేళ్లుగా ఎలాంటి శ్రమ లేకుండానే, ఎలాంటి లంచాలు ఇవ్వకుండానే తమ ఖాతాల్లోకి వచ్చి పడుతున్నాయి. దీంతో లబ్దిదారులు కేవలం తమ బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుంటే సరిపోతోంది. దీనిపై లబ్దిదారుల్లో సంతృప్తి కనిపిస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
ఇలా సీఎం జగన్ క్యాంపు ఆఫీసులో కూర్చుని నేరుగా బటన్లు నొక్కి సంక్షేమ పథకాల మొత్తాల్ని లబ్దిదారుల ఖాతాల్లోకి పంపేస్తుంటే ఇక వైసీపీ ఎమ్మెల్యేల వద్దకు వచ్చేవారే కరువయ్యారు. సంక్షేమ పథకాలు కావాలంటే స్ధానిక వాలంటీర్లనో, సచివాలయాల్లో కార్యదర్శులనో కలుస్తున్నారు. ఓసారి దరఖాస్తు చేసుకున్నాక నేరుగా డబ్బులు ఖాతాల్లోనే పడిపోతున్నాయి.
దీంతో ఎమ్మెల్యేలకు గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా పరపతి పడిపోయినట్లు భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తాము ఓటెలా అడగాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రశ్నించే పరిస్ధితి వచ్చేసింది. అయినా జగన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఈ విషయం ఏదో విధంగా జగన్ వద్దకు చేరింది.

జగన్ కీలక నిర్ణయం
వైసీపీ ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తిపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్న జగన్ తన బటన్ క్లిక్స్ కు సంబంధించి నెలకొన్న అసంతృప్తిని ఎట్టకేలకు గుర్తించారు. ఇప్పటివరకూ తాను చెప్పిందే జరగాలని అనుకున్న జగన్ ఈసారి మాత్రం కాస్త తగ్గి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
దీని ప్రకారం ఇకపై వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా కాస్త అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఆ విషయాన్నే తాజాగా జరిగిన గడప గడపకూ ప్రభుత్వం సమీక్షలో వారికి చెప్పేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు దీన్నో ఊరటగా భావిస్తున్నారు.

ఎమ్మెల్యేలకు జగన్ షేరింగ్ ఇలా.. !
ఇప్పటివరకూ క్యాంపు ఆఫీసులో కూర్చుని అన్ని బటన్స్ తానే నొక్కుతున్న సీఎం జగన్ .. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇకపై సంక్షేమ పథకాల మైలేజ్ ను వైసీపీ ఎమ్మెల్యేలకూ పంచాలని నిర్ణయించారు. ఇందుకోసం త్వరలో తన పుట్టినరోజున జరిగే బైజూస్ ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను భాగస్వాముల్ని చేయాలని నిర్ణయించారు.
దీంతో విద్యార్ధులకు ఈసారి ఎమ్మెల్యేలు బైజూస్ కంటెంట్ నింపిన ట్యాబ్ లు అందజేయబోతున్నారు. అలాగే రైతు భరోసా బటన్ ను తాను క్లిక్ చేసినా గ్రామసభల్లో ఎమ్మెల్యేలు డమ్మీ చెక్ లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గడప గడపకు పేరుతో జనాల్లో తిప్పడమే కాదు, తమకూ మైలేజ్ వచ్చేలా జగన్ తీసుకున్న నిర్ణయాలపై ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications