YS Jagan-Nirmala Sitharaman : నిర్మలా సీతారామన్ తో జగన్ కీలక భేటీ-అప్పులపై ఆంక్షలొద్దని వినతి..
ఏపీ సీఎం వైఎస్ జగన్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఇందులో ఆయన పలు అంశాల్ని ఆర్ధికమంత్రి ముందుంచారు. వీటిలో రాష్ట్ర అప్పులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రత్యేక హోదా, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలు వంటి అంశాలున్నాయి.
నిర్మలా సీతారామన్ తో భేటీలో వైఎస్ జగన్ మొత్తం 9 అంశాలపై చర్చించారు. ఇందులో ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే ఈ డబ్బు మంజూరుచేయాలని కోరారు.
రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని తెలిపారు. నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని, 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి ఇచ్చి , ఆ తర్వాత రూ.17,923 కోట్లుకు కుదించారని గుర్తుచేశారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు.

అలాగే తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, ఈ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా జగన్ కోరారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, వాటిని విడుదల చేసేలా చూడాలని కూడా కోరారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్ గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని సీఎం జగన్ ఆర్ధికమంత్రిని కోరారు. డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, వెంటనే ఈ నిధులు విడుదలచేయాలని అడిగారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చుచేసిన రూ.2600.74 కోట్ల రూపాయలను సత్వరమే రీయింబర్స్ చేయాలని కూడా కోరారు.
పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించిందని, దీనికి వెంటనే ఆమోదం తెలపాలన్నారు.రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, ఆ హామీ నిలబెట్టుకోవాలని కోరారు. ఈ భేటీ ముగిశాక జగన్ ఢిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడ తిరిగొచ్చారు.












Click it and Unblock the Notifications