ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల: మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ సెటైర్!!
రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం పట్టం కట్టడంతో ఏపీలో రాజకీయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావడానికి పని చేస్తానని చెప్పిన వైఎస్ షర్మిల ఏపీలో వైయస్ జగన్ తో తలబడబోతున్నారా అన్నది ప్రస్తుతం ఆసక్తికర చర్చగా మారింది.
ఇక ఇదే సమయంలో ఏపీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకంపై వైసిపి నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించిన క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

వైఎస్‌ఆర్‌తో పాటే ఏపీ కాంగ్రెస్ కీర్తిశేషులు అయ్యిందనే సెన్స్‌లో ఆయన ట్వీట్ చేశారు. 'డా: వైఎస్ఆర్, ఏపీ కాంగ్రెస్..కీ.శే..లే' అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం లేడని, అలాగే ఏపీ కాంగ్రెస్ కూడా ప్రస్తుతం లేదని అర్థం వచ్చేలా బాబు ట్వీట్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీనే లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎవరిని నియమిస్తే ఏమిటన్న అభిప్రాయం తన ట్వీట్ ద్వారా ఆయన పేర్కొన్నారు.
Dr YSR , AP Congress.. కీ౹౹శే.. లే!
— Ambati Rambabu (@AmbatiRambabu) January 16, 2024
ఏది ఏమైనా ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా వైయస్ షర్మిలను నియమించడం వైసిపి కి షాక్ అని చెప్పాలి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల రంగంలోకి దిగితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో, వైసీపీలో అసంతృప్తులు చాలా మంది ఆమె వైపు చూసే అవకాశం ఉందని, కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది.
ఏది ఏమైనా షర్మిల ఎంట్రీ తో ఏపీ రాజకీయాలు ఎన్నికల సమయంలో ఊహించని మలుపులు తిరుగుతాయి అన్నది నిర్వివాదాంశం.ఈ క్రమంలో వైఎస్ షర్మిల ఏపీ పాలిటిక్స్ లో ఎంట్రీ ఎవరు స్వాగతిస్తారు.. ఎవరు వ్యతిరేకిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications