వైఎస్ షర్మిలకు ప్రాణహాని.. భద్రత పెంచాలి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రంగంలోకి దిగి అన్న పైన పోరాటం చేస్తున్న, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను టార్గెట్ చేస్తున్న వైయస్ షర్మిల విషయంలో ప్రత్యర్థి పార్టీల నేతల నుండి కూడా సానుభూతి వ్యక్తం అవుతుంది. జగన్ ను దీటుగా ఎదుర్కొంటున్న వైయస్ షర్మిలకు బాసటగా పలువురి గొంతు ప్రస్తుతం వినిపిస్తుంది.
ఈ క్రమంలో తాజాగా టిడిపి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు షర్మిల కు ప్రాణహాని ఉందంటూ, ఆమెకు భద్రత పెంచాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు భద్రత పెంచాలని, ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డికి తల్లి, చెల్లి, బాబాయ్ అని తేడా ఏమీ లేదని ఆరోపించారు. రాజకీయంగా ఆమెని ఎదుర్కోలేక అంతమొందించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

వైసీపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన అయ్యన్నపాత్రుడు షర్మిలకు వైఎస్ఆర్ ఇచ్చిన ఆస్తులలో వాటాను పంచకుండా జగన్ ఆపుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ప్రియమైనది కూతురు షర్మిల అన్న విషయం ఆయన సన్నిహితులు అందరికీ తెలుసనీ, అందుకే ఆమెకు ఆస్తిలో ప్రత్యేకంగా వాటా రాశారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఆ ఆస్తిని షర్మిలకు ఇవ్వకుండా జగన్ అడ్డుకుంటున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులు చేజారి పోతాయనే భయం జగన్ కు ఉందని విమర్శించిన ఆయన, ఆ ఆస్తులు చేజారి పోతే ఎలా అని షర్మిలకు వైఎస్సార్ ఇచ్చిన వాటాను పంచకుండా ఆపుతున్నారు అని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయం పైన నోరు జారిన విషయాన్ని అందరూ గమనించాలి అంటూ కొత్త అంశాన్ని అయ్యన్నపాత్రుడు తెరపైకి తీసుకువచ్చారు. షర్మిలకు ఉన్న ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని తక్షణం ఆమెకు భద్రతను పెంచాలని టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications