వైఎస్ ఫ్యాన్స్ కు షర్మిల లేఖ-ఆస్తుల వివాదం లోగుట్టు ఇదే-తప్పుగా అర్ధం చేసుకోవద్దు..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన చెల్లి వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మపై జాతీయ కంపెనీల లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
ఇప్పటికే షర్మిల, విజయమ్మపై పిటిషన్ దాఖలు చేసిన జగన్.. అదే సమయంలో తన సాక్షి మీడియా ద్వారా ప్రసారం చేస్తున్న కథనాలు చర్చనీయాంశంగా మారాయి. వీటిపై ఇవాళ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల స్పందిస్తూ దివంగత వైఎస్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు.

నాన్న మాాటల్లో షర్మిల-వాళ్లందరికీ తెలుసు
తల్లి విజయమ్మ, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఓ పుస్తకం రాశారని, అందులో తండ్రి గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారని షర్మిల తెలిపారు. రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తయితే తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారని గుర్తుచేశారు. నాన్నకు తనంటే ప్రాణమని, నాన్న తనన ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదన్నారు. తంరబ్రతికి ఉన్నన్ని రోజులు నలుగురు మనవళ్లు, మనవరాళ్ల తనకు సమానం అనే వారన్నారు. తాను స్థాపించిన అన్ని సంస్థలు, వ్యాపారాల్లో సమాన వాటా కూడా ఉండాలనే వారన్నారు. అవి జగన్ మోహన్ రెడ్డి సొంతం కాదన్నారు. ఆయన గార్డియన్ మాత్రమేనని కూడా తెలిపారు. వైఎస్ ఉద్దేశం కేవీపీ, వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, భారతికీ తెలుసన్నారు.
వైఎస్ ఆస్తులు పంచలేదు-జగన్ ఆస్తుల్లో వాటా అడగట్లేదు
రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం జరగలేదని, వైఎస్ఆర్ హఠాత్తుగా మరణించారని, ఆ తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదని షర్మిల తెలిపారు.. ఈ రోజు వరకు తనకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా తన చేతుల్లో లేదన్నారు. స్వార్జితం అని జగన్ చెప్పుకుంటున్న ఆస్తులు అన్ని కుటుంబ ఆస్తులే అన్నారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవం అన్నారు. తాను జగన్ ఆస్తుల్లో వాటా అడుగుతున్నాను అనేది హాస్యాస్పదం అన్నారు.
ఆస్తులపై మోజు లేదు-బిడ్డల కోసమే
తనకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై మోజు లేదని, వీళ్ళు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదని షర్మిల తెలిపారు. కేవలం తన బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలి అనేది రాజశేఖర్ రెడ్డి అభిమతం గనుక,ఈ రోజు వరకు కూడా అమ్మైనా, తానైనా తపన పడుతున్నామన్నారు. ఇప్పటికీ అమ్మ వెయ్యి సార్లు వీళ్ళను అడిగి ఉంటుందని, వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుందని షర్మిల తెలిపారు. అయినా తన బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు.
అవసరం ఉన్నంతవరకూ బాగానే చూసుకున్నారు
వైఎస్ మరణం తర్వాత..10 ఏళ్లు జగన్ ఇబ్బందులు పడితే, అవి తన ఇబ్బందులు అనుకొని సాయం చేశానన్నారు. తోడబుట్టిన వాడికోసం నా బిడ్డలను సైతం పక్కనపెట్టి ఆయన్ను, ఆయన పార్టీని ఏ స్వార్ధం లేకుండా భుజాల మీద మోశానన్నారు. ఆ 10 ఏళ్లు తన అవసరం ఉంది అనుకున్నారో, ఏమో బాగానే చూశారన్నారు. పెద్ద కూతురు అన్నారని, ఆ 10 ఏళ్లు వైఎస్సారర్ ఊహించినట్లే .. గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు సమానం అన్నట్లుగానే వ్యవహరించారన్నారు. అప్పుడు 200 కోట్లు ఇచ్చామని చెప్తున్నది ఇందులో భాగంగానే అన్నారు. కంపెనీల్లోని డివిడెండ్ లో సగం వాటా తనకు ఇవ్వడమే ఈ 200 కోట్లు అన్నారు. వాళ్ళు చేసింది ఉపకారం కాదన్నారు. ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదని, తనకు సమాన వాటా ఉంది కాబట్టి డివిడెండ్ లో సగం వాటా ఇవ్వడం జరిగిందన్నారు. అది కూడా అప్పుగా చూపించమన్నారన్నారు.
అధికారం వచ్చాక మారిపోయిన జగన్
2019లో జగన్ సీఎం అయ్యారని, ఆ తర్వతా గుర్తుపట్టలేనంతగా మారిపోయారని షర్మిల తెలిపారు. చిన్నచూపు చూడటమే కాకుండా సిఎం అయిన నెలరోజులకే విడిపోదాం అని ఇజ్రాయిల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారన్నారు. ఇందుకు అమ్మా, తాను వద్దు అని చెప్పామన్నారు. లేదు ససేమిరా విడిపోవాల్సిందే అని పట్టుబట్టాడన్నారు. తర్వాత రోజుల్లో ఆస్తులు పంచుకుందామని విజయవాడకు రమ్మన్నారని, విజయవాడకు వచ్చాక, భారతి సిమెంట్స్, సాక్షిలో తనకు ఎక్కువ వాటా కావాలని అడిగాడన్నారు. తాను 60 తీసుకుంటా, నీకు 40 ఇస్తా అని చెప్పాడన్నారు. అది అమ్మకు కూడా భావ్యం అనిపించలేదన్నారు.
ఆస్తుల్లో ఎక్కడ తేడా కొట్టిందంటే ?
సగం కంటే ఎక్కువ కావాలని గట్టిగా అనుకుంటే 5 శాతం ఎక్కువ తీసుకో లేదా 10 శాతం ఎక్కువ తీసుకో కానీ 20 శాతం ఎక్కువ కావాలని అడగడమంటే అన్యాయం అనిపిస్తుంది అని అమ్మ చెప్పిందని షర్మిల గుర్తుచేశారు. అయినా ఇంతే అని బుల్డోజ్ చేశారని, తర్వాత అర్ధగంటలో ఈ ఆస్తులు నీకు, ఈ ఆస్తులు నాకు అని తేలిపోయిందన్నారు. దీని ప్రకారం సాక్షిలో 40 శాతం, భారతి సిమెంట్స్ లో వాళ్లకు చెందిన 49 శాతంలో 40 శాతం, సరస్వతి పవర్ లో 100 శాతం, యలహంక ప్రాపర్టీలో 100 శాతం, వైఎస్ఆర్ నివసించిన ఇల్లు, ఇంకా కొన్ని ఆస్తులు తన భాగానికి వచ్చిందని షర్మిల తెలిపారు.
ఎంవోయూపై అందుకే సంతకం పెట్టా
ఆ కొద్ది వారాల్లోనే MOU తయారయ్యిందని, అంతకు ముందు మాట్లాడుకున్న దాని ప్రకారం సరస్వతి సిమెంట్స్ షేర్స్, యలహంక ప్రాపర్టీ అటాచ్ కాలేదు కాబట్టి అది వెంటనే రాసిస్తామని, మిగతా ఆస్తులు కేసుల వ్యవహారం పూర్తి అయిన తర్వాత బదిలీ చేస్తామని, ఒప్పందం జరిగి సంతకాలు పెట్టినట్లు షర్మిల తెలిపారు. తన వాటా తనకు ఇస్తున్నాడు తప్పితే ప్రేమ అభిమానాలతో కాదనేది వాస్తవమైనా, జగన్ ది పైచేయిగా ఉన్నది కాబట్టి వాళ్ళు రాసినదానిపై అమ్మ తనను సంతకం పెట్టమని కోరిందన్నారు.
కేసుల్లో లేని సరస్వతి, యలహంక ప్రాపర్టీలను, MOU మీద సంతకం పెట్టిన 2019 లోనే ఇవ్వాల్సి ఉండగా.. ఈ రోజు వరకు ఇవ్వాలన్న ఉద్దేశ్యం వాళ్లకు లేదని తెలిపారు. అమ్మ ఒత్తిడి మేరకు, క్లాసిక్, సండూరు హోల్డ్ చేస్తున్న 52 శాతం సరస్వతి షేర్స్ నీ 2021 లో కొనుక్కోవడానికి అంగీకరించారని, ఇక తర్వాత రోజుల్లో వాళ్ళ వ్యక్తిగత షేర్లు కూడా అమ్మకు గిఫ్ట్ ఇచ్చారన్నారు. అదే 2021లో తాను రాజకీయాల్లో అడుగుపెట్టడం, మొదట తెలంగాణలో, ఆ తర్వాత కాలంలో ఆంధ్రకు రావడం జరిగిందన్నారు. తనకు ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చానని, తనను తొక్కడానికి జగన్ చెయ్యని ప్రయత్నం లేదన్నారు.
కాంగ్రెస్ లో చేరగానే తిట్టడం మొదలుపెట్టేశారు
ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తే, నన్ను అన్ని రకాలుగా అవమానించడమే కాకుండా, సోషల్ మీడియాలో ఉచ్ఛం, నీచం లేకుండా, పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న దాన్ని అనే ఇంగితం కూడా లేకుండా, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. తననే కాదు, వైఎస్ఆర్ తమ్ముడు వివేకానంద రెడ్డి పర్సనల్ ఫోటోలు సాక్షి మీడియాలో అసభ్యకరంగా ప్రచురించి అతి దారుణంగా వ్యవహరించారన్నారు. ఆంధ్ర ఎన్నికల్లో జగన్ ఓడిపోయాక.. ఆ ఓటమికి తానే కారణం అని వాళ్ళు బలంగా నమ్మారని, కాబట్టి తమకు విరోధం వద్దని, సెటిల్ చేసుకుందామని, బంధువులను తన దగ్గరకు పంపించారని తెలిపారు.
ఓడిపోయాక సెటిల్మెంట్ కు మనుషుల్ని పంపారు
మాకు విరోధం వద్దు అంటూనే సెటిల్మెంట్ చేసుకోవడానికి కండీషన్ పెట్టారని షర్మిల తెలిపారు. తాను జగన్ మీద, భారతి రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద పబ్లిక్ ఫ్లాట్ ఫాంలో మాట్లాడకూడదనేది ఆ కండిషన్ సారాంశం అన్నారు. ఆ కండిషన్ తన వృత్తి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి తనకు సమ్మతం అనిపించలేదన్నారు. బంధువులు ఎంత ఒత్తిడి చేసినా తాను ఒప్పుకోలేదన్నారు. తాను ఒప్పుకోలేదు కాబట్టే సెటిల్ మెంట్ జరగలేదన్నారు.
అందుకే సెటిల్మెంట్ చేసుకోలేదు
సెటిల్ మెంట్ కి ఒప్పుకోలేదని మళ్ళీ కక్ష్య కట్టి, తన మీద, అమ్మ మీద ఎన్సీఎల్టీలో మోసం చేసి షేర్లు తీసుకున్నామని కేసు వేశారని, పబ్లిక్ లో గత కొన్ని రోజులుగా అమ్మ మీద కేసు వేసిన దుర్మార్గుడు అనే అపకీర్తి ఇప్పుడు వస్తుందని గమనించి.. తన బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపుతున్నారన్నారు. నిజానికి బెయిల్ రద్దు అయ్యే సీన్ లేదు. ఎందుకంటే సరస్వతి షేర్స్ అటాచ్ అవ్వలేదు. కంపెనీల్లో ఈడీ అటాచ్ చేసింది షేర్లు కాదు. 32 కోట్లు విలువ జేసే భూములు మాత్రమే. షేర్స్ ట్రాన్స్ఫర్ కి, ఆయన బెయిల్ రద్దు కి ఎటువంటి సంబంధం లేదు.
వైఎస్ పరువు తీయకూడదనే మౌనంగా ఉన్నాం
ఎన్సీఎల్టీలో జగన్ కేసు అమ్మ మీద కాబట్టి, ఈ విషయం బయటకు వస్తే, వైఎస్సార్ కుటుంబం అప్రతిష్టపాలయితే, యావత్ ప్రపంచం నాలుగు రకాలుగా మాట్లాడితే, అమ్మ ఎంతగానో క్షోభపడుతుందని, ఇది తమలో తామే విషాన్ని గొంతులో దాచుకున్నట్టు దాచుకున్నామని షర్మిల తెలిపారు. ఓ కుమారుడు తన తల్లికి తీసుకురాకూడని పరిస్థితి ఇది అన్నారు. విలువలు, కుటుంబం కోసం పాటుపడే రాజశేఖర రెడ్డి గారి కుమారుడే సొంత తల్లిని కోర్టుకి ఈడ్చడం, ఆ తల్లికి ఎంత అవమానం.? అందుకే స్వర్గంలో క్షోభిస్తున్న నాన్న కోసం, తన పక్కనే నిలబడి మాటల్లేని వేదన నిండిన అమ్మను మరింత బాధపెట్టకూడదని, అన్యాయంగా తమపై కేసు సంగతి ఎక్కడా బయట పెట్టలేదన్నారు.
జగన్ కేసు వేశారని అప్పడే తెలిసింది
కానీ కేసు వేసిన నెల రోజులకు ఈ విషయం వెలుగులోకి వచ్చిందని షర్మిల తెలిపారు. దీని వెనుక జగన్ కారణం అని ఎందుకు అనుకోకూడదని ప్రశ్నించారు. దుర్మార్గంగా తల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్ కు, తమను మోసం చేసిన వాళ్ళుగా చిత్రీకరించడంలోనే ప్రయోజనం ఉంది కదా అని అడిగారు. తాను జగన్ కు ఓ లెటర్ రాస్తే.. అది టీడీపీ హ్యాండిల్ లో పోస్ట్ అయితే... తనకు ఏం సంబంధం అన్నారు. తానైతే బైబిల్ మీద ప్రమాణం చేయగలని, తాను గాని, తన మనుషులు గాని బయట పెట్టలేదని ప్రమాణం చేయగలమన్నారు. చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం వైఎస్సార్ బిడ్డకు లేదన్నారు. జగన్ ఎవరి కొంగు చాటున ఉండి, ఆస్తి, అధికారం కోసం ఇదంతా చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు.
అభిమానుల కోసమే వాస్తవాలు చెప్తున్నా
అమ్మ, తాను మోసం చేస్తున్నామని గాని, లేక ఆస్తికోసం అత్యాశ పడుతున్నామని గాని, వైఎస్సార్ అభిమానులు భావించకూడదని.. వాస్తవాలు అన్ని మీ ముందు పెడుతున్నట్లు షర్మిల తెలిపారు. ఎంఓయూ తన చేతుల్లో 5 ఏళ్లు ఉన్నా...దాంట్లో తనకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వకపోయినా ఏ ఒక్క మీడియా కి కానీ, కోర్టుకి కానీ, తనకు తానుగా కానీ బయటపెట్టలేదన్నారు. అవకాశం, అవసరం ఉన్నా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా కుటుంబ గౌరవం, వైఎస్ పరువు కోసం ఎక్కడా 5 ఏళ్ళు ఎంఓయూ బయట పెట్టలేదన్నారు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన ఎంవోయీ బయటకు వచ్చిందన్నా పరస్పరం రాసుకున్న లెటర్లు బయటకు వచ్చాయన్నా.. NCLT లో తల్లి మీద కేసు వేసి సొంత అమ్మకే బ్రతుకు మీద అసహ్యం కలిగించి, YSR అభిమానులను ఎనలేని మానసిక క్షోభకు గురిచేసింది ఎవరో మీకు తెలుసంటూ ముగించారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications