చంద్రబాబుకు షర్మిల కీలక డిమాండ్..
YS Sharmila: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.
దివ్యాంగులపై చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదని ఆమె ధ్వజమెత్తారు. కనికరం లేకుండా వారి పొట్ట కొట్టాలని చూడటం దారుణమని వ్యాఖ్యానించారు. వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపాల్సింది పోయి వారి జీవితాలను చీకటిమయం చేయడం దుర్మార్గమని అన్నారు.

అనర్హుల కింద అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని చూడటం అన్యాయమని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హత పేరుతో 20 ఏళ్ల నుంచి పెన్షన్ పై బ్రతుకుతున్న వారికి సైతం రద్దు చేయాలని చూడటం సిగ్గుచేటుగా అభివర్ణించారు. వికలాంగుల జీవితాలతో రాజకీయం తగదని ఆమె హితబోధ చేశారు.
బోగస్ పెన్షన్లు గుర్తించడం మంచిదేనని, వికలాంగుల ముసుగులో అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులను ఏరివేత హర్షించ దగ్గదేనని షర్మిల అన్నారు. దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళపై, ఇచ్చిన డాక్టర్ల కఠిన చర్యలు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు.
అయినప్పటికీ- రీ వెరిఫికేషన్ పేరిట అర్హులను సైతం అనర్హులుగా పరిగణించడం పద్దతి కాదని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అర్హుల పేర్లు తొలగించి వారిని వేధించడం ఎంతమాత్రం మంచిది కాదని వ్యాఖ్యానించారు. నోటీసులు ఇచ్చిన 1.20 లక్షల మందిలో అర్హులే ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోందని ఆమె అన్నారు.
అనర్హులుగా గుర్తించిన దివ్యాంగుల జాబితాపై మళ్ళీ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందని షర్మిల స్పష్టం చేశారు. అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు. వెంటనే వారి పెన్షన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications