వర్షాలతో కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కిందే 16 మంది చిక్కుకుని..
భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. రహదారులు, కాలనీలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పురాతన భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఈ క్రమంలో పుణెలోని పింప్రీ చించ్వాడా అనే ప్రాంతంలో ఓ భారీ బిల్డింగ్ కుప్పకూలింది. వర్షాల ధాటికి ఆ భవనం కుప్పకూలగా అందులో దాదాపు 16 మంది కార్మికులు చిక్కుకున్నారు. అది ఓ ప్రేవేట్ వేస్ట్ ప్రాసెసింగ్ కంపెనీకు చెందిన పరిపాలన భవనం అని తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను ప్రస్తుతం బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.
భారీ వర్షాల కారణంగానే భవనం కుప్పకూలినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్నవారంతా ఆ సంస్థలే పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది అని తెలుస్తోంది. ఇక ఇప్పటికే అక్కడకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది క్షతగాత్రులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే ఘటనపై పింప్రీ చించ్వాడా మేయర్ రవి లాండ్గే మాట్లాడుతూ.. బిల్డింగ్ కుప్పకూలిన సమయంలో ఆఫీస్ లోని ఉద్యోగులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారని దాంతో ఒక్కసారిగా వారిపై స్లాబ్ పడిపోయిందని పేర్కొన్నారు. వారిలో ఇద్దరు ఎలాగోలా తప్పించుకున్నారని మిగతా వాళ్లు శిథిలాల కిందే చిక్కుకుపోయారని తెలిపారు. ఇక బిల్డింగ్ కుప్పకూలిన ప్రదేశం వద్ద స్థానికులు, సిబ్బంది బంధువులు, కుటుంబసభ్యులు భారీగా చేరుకుంటున్నారు.

మరోవైపు మహారాష్ట్రలోని పుణె, పింప్రి చించ్వాడా ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. వరదలు సంభవిస్తున్నాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 6 వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారులు. అలాగే పుణెలో ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలు మూసివేశారు. అటు భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications