విజయవాడలో ఆ రోడ్డుకు రంగా పేరు-చంద్రబాబును ఇరుకునపెట్టేసిన షర్మిల ?
ఏపీలో గత ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెడుతున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ మరో కీలక అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆమె ఓ లేఖ రాశారు. విజయవాడకు చెందిన దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా పేరును నగరంలోని ఓ కీలక రహదారికి పెట్టాలని ఆమె చంద్రబాబును కోరారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
పశ్చిమ బైపాస్ కు రంగా పేరు
విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ కోరారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ నుంచి గన్నవరం దగ్గరలోని చిన్న అవుటపల్లి వరకు ఈ బైపాస్ నిర్మిస్తున్నారు. మొత్తం 47.8 కిలోమీటర్ల పొడవైన విజయవాడ పశ్చిమ జాతీయ బైపాస్ రహదారి పూర్తి కావొచ్చినందుకు సంతోషం అని షర్మిల తెలిపారు. ఈ ఆరు వరసల రహదారి వల్ల విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తగ్గుతాయన్నారు.

రంగాను ఆకాశానికెత్తేసిన షర్మిల
ఈ బైపాస్ రోడ్డుకు విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. రంగా ప్రజలకు చేసిన సేవ అనిర్వచనీయం అన్నారు. సామాజిక న్యాయంపై దృష్టి సారించి, అణగారిన వర్గాల సంక్షేమం కోసం వాదించి, భూమి లేని వారికి భూ పంపిణీ చేసి, ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా అన్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి "వంగవీటి మోహన రంగా బైపాస్ జాతీయ రహదారి" గా పేరు పెట్టాలని..కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని షర్మిల కోరారు.
ఎన్టీఆర్ పేరు డిమాండ్లు
వాస్తవానికి విజయవాడకు మణిహారంగా మారబోతున్న పశ్చిమ బైపాస్ రోడ్డుకు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పేరు పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంంలో షర్మిల వంగవీటి రంగా పేరును సడన్ గా ఎందుకు తెరపైకి తెచ్చారన్న చర్చ జరుగుతోంది. గతంలో జగన్ హయాంలో విజయవాడతో కూడిన జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చినా వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎన్టీఆర్ పేరు పెట్టింది. అయితే ఇప్పుడు పశ్చిమ బైపాస్ కు కూడా ఎన్టీఆర్ పేరు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెెలిసే షర్మిల ఇలా రంగాను తెరపైకి తెచ్చారా అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న వంగవీటి రంగా తనయుడు రాధా మాత్రం దీనిపై స్పందించలేదు.












Click it and Unblock the Notifications