జగన్ పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు- నాకు అన్యాయం చేసినా-చీలికకు కారణం మీరే..!
ఏపీని ఒకప్పడు విభజించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు తన సోదరి షర్మిల రూపంలో తన కుటుంబాన్ని సైతం చీల్చేందుకు ప్రయత్నిస్తోందంటూ నిన్న తిరుపతిలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ విమర్శలకు సోదరి, ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. జగనన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, దేవుడే గుణపాఠం చెప్తారట అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.
ఏపీ ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్ధితిలో ఉందంటే చంద్రబాబు, జగనే కారణమంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు.వైఎస్ కుటుంబం చీలిందంటే అది జగన్ చేతులారా చేసుకున్నదే అంటూ వ్యాఖ్యానించారు. దీనికి దేవుడు, తన తల్లి విజయమ్మే సాక్ష్యం అన్నారు. జగన్ పార్టీ ఇబ్బందుల్లో ఉంటే, 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి తనవైపుకు వస్తే అధికారంలోకి వచ్చాక మంత్రుల్ని చేస్తామన్నారని, ఇప్పుడు వారిలో ఎంతమంది మంత్రులయ్యారని షర్మిల ప్రశ్నించారు.

గతంలో 18 మంది జగన్ కోసం రాజీనామాలు చేస్తే వారిని గెలిపించడానికి తానూ, తల్లి విజయమ్మ తిరిగి గెలిపించామని షర్మిల గుర్తుచేశారు. వైసీపీ కష్టాల్లో ఉందని పాదయాత్ర చేయమంటే ఇల్లు, పిల్లల్ని పక్కనబెట్టి ఎండనక, వాననక రోడ్లమీదే ఉన్నట్లు గుర్తుచేశారు. ఎప్పుడు అడిగితే అప్పుడు మారు మాట్లాడకుండా అండగా నిలబడ్డానని షర్మిల తెలిపారు. ఎందుకని అడక్కుండా నిస్వార్ధంగా ఏది అడిగితే అది చేశానన్నారు. గత ఎన్నికల్లోనూ బైబై బాబూ అంటూ ఊరూరా తిరిగానన్నారు. అలా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే ఆ తర్వాత జగన్ మారిపోయారన్నారు.
తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా ఫర్వాలేదనుకున్నాని, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలనుకున్నట్లు షర్మిల గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ పేరు నిలబెడతాడనుకున్నానన్నారు. కానీ ఈ ఐదేళ్లలో సీఎం సహా అంతా బీజేపీకి బానిసలుగా మారారరన్నారు. బీజేపీకీ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ లేకపోయినా రాష్ట్రంలో రాజ్యం ఏలుతోందని విమర్శించారు. దీనికి కారణం జగన్ తన పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టడమే అన్నారు. జగన్ ప్రత్యేక హోదా అడక్కుండా బానిస అయ్యారని, ఐదేళ్లలో ఏ ఒక్క రోజూ అడగలేదన్నారు.












Click it and Unblock the Notifications