దేశ చరిత్రలోనే ఇది తొలిసారి.. చంద్రబాబును ఏకిపారేసిన వైఎస్ షర్మిల!
ఏపీలోని ఎన్డీయే సర్కార్ పైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న తీరుపైన టార్గెట్ చేస్తున్నారు. తాజాగా నిరుద్యోగుల సమస్యపైన చంద్రబాబు సర్కార్ ను ప్రశ్నించిన వైఎస్ షర్మిల నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. APPSCపై కూటమి సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు నాలుగు నెలలుగా చైర్మన్ లేకపోవడం సిగ్గుచేటు అంటూ వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. దేశ చరిత్రలో ఇది తొలిసారి అని ఏపీపీఎస్సీకి నాలుగు నెలలుగా చైర్మన్ లేకపోవటం దారుణమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మీ ప్రక్షాళన రాజకీయాలకు నిరుద్యోగులను బలి చేస్తున్నారన్నారు.

చైర్మన్ లేక నోటిఫికేషన్లు లేవు
శ్వేతపత్రాల మీద పెట్టిన శ్రద్ధ..కమీషన్ బలోపేతంపై పెట్టలేదని మండిపడ్డారు. . చైర్మన్ నియామకం జరగక కొత్త నోటిఫికేషన్లు లేవన్నారు. నోటిఫికేషన్ లు విడుదలైన వాటికి పరీక్షల నిర్వహణ లేదని మండిపడ్డారు. వాయిదా వేసిన గ్రూప్ 1, గ్రూప్ 2, లాంటి పరీక్షలను మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదని పేర్కొన్న వైఎస్ షర్మిల ప్రభుత్వ పట్టింపు లేని వైఖరిని తప్పుబట్టారు.
21 పరీక్షలు పెండింగ్ పడ్డాయంటే చిత్తశుద్ధి అర్ధం అవుతుంది
APPSC పరిధిలో 21 పరీక్షలు పెండింగ్ పడ్డాయంటే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్న వైఎస్ షర్మిల తక్షణం APPSC చైర్మన్ ను నియమించాలన్నారు.
నిరుద్యోగుల కోసం చంద్రబాబుకు వైఎస్ షర్మిల డిమాండ్లు
అనంతరం వాయిదా వేసిన పరీక్షలను నిర్వహించాలని, త్వరిత గతిన పోస్టులను భర్తీ చెయ్యాలని అన్నారు. అంతేకాదు విడుదలైన నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకటన చేయించండని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండి, కమీషన్ భర్తీ చేయాల్సిన ఒక లక్ష పోస్టులకు కొత్తగా అనుమతి ఇవ్వాలని కూడా వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఆందోళనలో ఉన్న నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications