YS Sharmila: కాసేపట్లో కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరిక-పదవిపై వీడని సస్పెన్స్!
ఉమ్మడి ఏపీ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఇవాళ రాజకీయంగా కీలక అడుగు వేయబోతున్నారు. అన్న వైఎస్ జగన్ తో విభేదించి తెలంగాణకు వెళ్లిపోయి వైఎస్సార్టీపీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్న షర్మిల తెలంగాణ ఎన్నికలకు ముందు హల్ చల్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో తన పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తానూ అదే పార్టీలో చేరిపోయేందుకు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం, తన చేరిక కోసం ఇవాళ ఉదయం 11 గంటలకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్న వైఎస్ షర్మిల నిన్న రాత్రే ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోయారు. అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్, సోనియా గాంధీ వంటి నేతల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. తనతో పాటు మరికొందరు వైఎస్సార్టీపీ నేతలు కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉంది. అనంతరం ఏపీకి వచ్చి షర్మిల తన పని మొదలుపెట్టబోతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో షర్మిల విలీనాన్ని ఏపీసీసీతో పాటు ఏపీలో ఇతర విపక్ష పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ కు వ్యతిరేకంగా ఉన్న వారందరికీ షర్మిల ఇప్పుడు మరో ఆశాదీపంగా కనిపించబోతున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరిక తర్వాత షర్మిలకు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే షర్మిల ముందు కాంగ్రెస్ పార్టీ మూడు ఆప్షన్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏపీసీసీ ఛీఫ్, ఏఐసీసీ కార్యదర్శి పదవి, రాజ్యసభ సీటు వంటి మూడు ఆప్షన్లలో ఆమె ఏది ఎంచుకున్నారో ఇవాళ తేలిపోనుంది.
అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల సారధ్యం వహిస్తానంటే ఇబ్బంది లేదనేలా ఇప్పటికే రాష్ట్ర నేతలు సంకేతాలు ఇచ్చేశారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రాకపోయినా వచ్చే ఎన్నికల్లో కనీస సీట్లతో తిరిగి ఉనికి చాటుకోవచ్చనే ఆలోచనలో నేతలు ఉన్నారు. దీంతో షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశముంది. చివరి నిమిషంలో అద్భుతాలేమైనా జరిగితే తప్ప ఆమెకు పీసీసీ పగ్గాలు దక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో చేరగానే ఈ విషయం ప్రకటించకుండా రేపో మాపో కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రకటన చేసే అవకాశాలూ లేకపోలేదు.












Click it and Unblock the Notifications