వివేకా హత్య కేసు- ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీం తీర్పు రిజర్వ్-కీలక వ్యాఖ్యలు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో ఇవాళ తుదివాదనల ముగించిన సుప్రీంకోర్టు.. త్వరలో తీర్పు ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై సుప్రీంకోర్టులో విచారణ ఇవాళ ముగిసింది. ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం సీబీఐ దాఖలు పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. గంగిరెడ్డి బెయిల్ రద్దుపై మళ్లీ విచారణ జరపాలని ఆదేశిస్తే తెలంగాణ హైకోర్టును ఆదేశించాలా? లేక ఏపీ హైకోర్టును ఆదేశించాలా? అని న్యాయమూర్తి ఎం ఆర్ షా ప్రశ్నించారు. గంగిరెడ్డి బెయిల్ పొందేనాటికి అసలు విచారణే జరగలేదని, కీలక విషయాలేమీ దర్యాప్తులో బయటకు రాలేదు కదా? అని న్యాయమూర్తి ఎం ఆర్ షా ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో కేసు తీవ్రత నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ ను రద్దు చేయవచ్చని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో దర్యాప్తు చేసిన ఏపీ పోలీసులు గంగిరెడ్డి కి డిఫాల్ట్ బెయిల్ రావడానికే చార్జిషీటు దాఖలుకు జాప్యం చేశారని అనుకోవడానికి ఆస్కారం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గంగిరెడ్డికి రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి ఏదైనా సాధ్యమయ్యే అవకాశాలున్నాయని కూడా తెలిపింది. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసిన అంశాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది.
వైఎస్ వివేకా హత్య కేసులో గంగిరెడ్డి పాత్ర అపరిమితమని దర్యాప్తులో తేలినట్లు సీబీఐ తరపు న్యాయవాది నటరాజన్ పేర్కొన్నారు. మెరిట్ పైన కాకుండా డిపాల్ట్ గానే గంగిరెడ్డికి బెయిల్ వచ్చిందన్నారు. అటువంటి సమయంలో సాక్ష్యులను బెదిరించినా, ప్రభావితం చేసినా, దర్యాప్తుకు ఆటంకాలు కలిగించినా బెయిల్ రద్దు చేయవచ్చన్నారు. సీబీఐ దర్యాప్తు తరువాతనే గంగిరెడ్డి ఏ1 అని నిర్ధారణ అయినందున బెయిల్ రద్దు చేయాలని కోరారు. అందుకే ఆయనను విచారించాలని భావిస్తున్ననట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. గంగిరెడ్డి అన్ని విధాలుగా విచారణకు సహకరిస్తున్నారన్న ఆయన తరపు న్యాయవాది ఆదినారాయణ రావు, కావాలంటే నార్కో పరీక్షలు కూడా చేసుకోవచ్చని స్వచ్ఛందంగా గంగిరెడ్డి ముందుకొచ్చిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం విచారణ ముగించిన సుప్రీంకోర్టు.. తీర్పు రిజర్వ్ చేసింది.












Click it and Unblock the Notifications