జగన్ పార్టీ అభ్యర్థికి చుక్కెదురు: తమిళంలో నామినేషన్
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాలో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన రంపచోడవరంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఉదయభాస్కర్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి శంకర వరప్రసాద్ సోమవారం తిరస్కరించారు. ఆయన గిరిజనుడు కాదంటూ ఇతర పార్టీల అభ్యర్థులు అభ్యంతరాలను దాఖలు చేశారు. వీటిపై ఉదయభాస్కర్ ఇచ్చిన వివరణలను పరిశీలించారు. ఆయన గిరిజనుడు కాదనే విషయాన్ని రిటర్నింగ్ అధికారి నిర్ధారించారు.
వాస్తవానికి 2009 ఎన్నికల్లోనూ ఉదయ భాస్కర్ వేసిన నామినేషన్‌ను అప్పటి రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిరుడు సెప్టెంబర్‌లో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. ఉదయ భాస్కర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. దీంతో రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డమ్మీ అభ్యర్థి వంతెల రాజేశ్వరిని తమ అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది.

రంపచోడవరం తెలుగుదేశం అభ్యర్థి శీతంశెట్టి వెంకటేశ్వరరావు నామినేషన్‌పై దాఖలైన అభ్యంతరాన్ని రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం లోక్‌సభ వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి మాజీ మంత్రి కె.పార్థసారథి నామినేషన్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 'ఫెరా' ఉల్లంఘన కేసులో హైకోర్టు ఆయనకు రెండు నెలల జైలు శిక్ష విధించినందున, నామినేషన్‌ను తిరస్కరించాలని హైదరాబాద్‌కు చెందిన కోనేరు వెంకట సురేశ్ ఫిర్యాదు చేశారు. అయితే జైలు శిక్షపై హైకోర్టు, సుప్రీం కోర్టు స్టే ఇచ్చినట్లు పార్థసారథి తరఫు న్యాయవాది వివరించారు. స్టే ఉత్తర్వులు చూపిన తర్వాతే ఆయన నామినేషన్‌ను ఆమోదిస్తామని అధికారులు తెలిపారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో స్టే ఉత్తర్వులను చూపించడంతో పార్థసారథి నామినేషన్‌పై ఉత్కంఠ తొలగిపోయింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జైసమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి కె.సురేశ్ కుమార్ నామినేషన్‌ను సాంకేతిక లోపాలతో తిరస్కరించారు. తణుకు అసెంబ్లీలో 25 సంవత్సరాలు నిండేందుకు మరో రెండు రోజులు మిగలి ఉండడంతో మణికంఠ అనే స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారు. చిత్తూరు జిల్లాలో తమిళనాడుకు చెందిన జి.లత అనే మహిళ తన వివరాలను తెలుగు, ఇంగ్లీషులో కాకుండా తమిళంలో రాయడంతో 'చదువుకొనుటకు వీలు కాలేదు' అనే కారణంతో నామినేషన్ పక్కన పెట్టారు.
కడప జిల్లాలో బీఎస్పీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులో తెలుగుదేశం అభ్యర్థి జితేంద్ర గౌడ్ నామినేషన్‌పై వైయస్సార్ అభ్యర్థి పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. వీటి పరిశీలనను రిటర్నింగ్ అధికారి మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications