సినిమాలోనే: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే, జగన్ ఆరా
హైదరాబాద్: గుంటూరు తూర్పు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు ముస్తఫా ఆదివారం కన్నీళ్లు పెట్టుకున్నారు. మేడికొండూరు వద్ద ఉదయం అంబటి రాంబాబు, ముస్తఫా కారు పైన దాడి జరిగిన విషయం తెలిసిందే. ముస్తఫాకు స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో ఆయన కన్నీంటి పర్యంతమయ్యారు.
ఇలాంటి దారుణం తాను ఎప్పుడు చూడలేదన్నారు. ఎమ్మెల్యే అయిన తన పైనే దాడి చేశారంటే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టారన్నారు. మహిళా ఎంపీటీసీలను దౌర్జన్యంగా లాక్కెళ్లారని ఆరోపించారు. సినిమాలో తప్ప తాను ఇలాంటి దౌర్జన్యాలు బయట చూడలేదన్నారు. పోలీసులు స్పందించలేదని ఆరోపించారు.

మరోవైపు, మేడికొండురు ఘటన పైన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన ఎమ్మెల్యే ముస్తఫాకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు కారు పైన దాడి జరిగిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా మేడికొండూరు సమీపంలో ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు ప్రయాణిస్తున్న అంబటి కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపిస్తోంది. ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళుతుండగా ఈ దాడి జరిగింది.












Click it and Unblock the Notifications