ఎన్నికల వేళ మరో సంచలనం - రుషికొండపై రాష్ట్ర సచివాలయం..!!
ఎన్నికలు సమీపిస్తున్న ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా విశాఖలో రుషికొండను సందర్శించారు. సీఎం జగన్ కు ఎన్ని ఇళ్లు కావాలని ప్రశ్నించారు. టీడీపీ సైతం వైసీపీ నేతలు రుషికొండను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో అధికార వైఎస్సార్సీపీ తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. రుషికొండ పైన సీఎం జగన్ సచివాలయ భవనాలు నిర్మిస్తున్నారని వెల్లడించింది.
ఏపీలో మూడు రాజధానుల వివాదం కొనసాగుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం. ప్రస్తుతం మూడు రాజధానుల కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటు విశాఖలో అక్టోబర్ 24న దసరా నుంచి సీఎం జగన్ పాలన ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది.

వారంలో మూడు రోజులు సీఎం జగన్ విశాఖలోనే ఉంటారు. ఇదే సమయంలో రుషికొండ పైన నిర్మాణాల పైన రాజకీయంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా జనసేనాని పవన్ రుషికొండను సందర్శించారు, అక్కడ నిర్మాణాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి నివాసం నిర్మిస్తున్నారని..జగన్ కు ఎన్ని ఇళ్లు కావాలని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు ప్రభుత్వంంలోని ముఖ్యులు రుషికొండ నిర్మాణాల పైన స్పష్టత ఇవ్వలేదు. దీంతో, అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మంత్రులు మాత్రం ప్రభుత్వమే నిర్మాణాలు చేపట్టినప్పుడు ఆక్రమణ ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో అధికార వైఎస్సార్సీపీ ఒక ట్వీట్ చేసింది. రుషికొండను సీఎం జగన్ ఆక్రమించి..అక్కడ ఇంటిని నిర్మిస్తున్నారనే సోషల్ మీడియా ప్రచారానికి కౌంటర్ గా ఈ ట్వీట్ చేసింది.
అందులో..విశాఖను దోచుకుంది @JaiTDP నాయకులేనని సాక్షాత్తూ గత మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు అనలేదా? టీడీపీ నాయకులు దోచుకున్న 450 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది @ysjagan గారి ప్రభుత్వం. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి, రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నారు వైయస్ జగన్ గారు. దాని మీద మీ పార్టీ దుష్ప్రచారం చూస్తుంటే మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేదనిపిస్తోంది...అని అందులో పేర్కొంది.
విశాఖను దోచుకుంది @JaiTDP నాయకులేనని సాక్షాత్తూ గత మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు అనలేదా? టీడీపీ నాయకులు దోచుకున్న 450 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది @ysjagan గారి ప్రభుత్వం. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి,… https://t.co/ijeOLMvd2H
— YSR Congress Party (@YSRCParty) August 12, 2023
దీని ద్వారా రుషికొండ పైన ఏపీ పాలనా కేంద్రం సచివాలయం నిర్మిస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. విశాఖలో పాలన రాజధాని ఏర్పాటులో భాగంగా ఈ నిర్మాణలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే, మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండటంతో..తీర్పు వచ్చే వరకూ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశాలు లేవని చెబుతున్నారు.
కోర్టు తీర్పుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని ప్రభుత్వంలోని ముఖ్యులు స్పష్టం చేస్తున్నారు. ఇక, ఇప్పుడు విశాఖ కేంద్రంగా పవన్ కల్యాణ్, సీఎం జగన్ లక్ష్యంగా చేస్తున్న ఆరోపణల వేళ మంత్రులు గట్టిగానే కౌంటర్ చేస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ చేసిన ఈ ట్వీట్ తో రుషికొండ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications