Thota Trmurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలుశిక్ష, 2 లక్షల జరిమానా !
ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నుంచి మండపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీలో ఉన్న సీనియర్ రాజకీయ నేత తోట త్రిమూర్తులుకు విశాఖ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల కేసుల ప్రత్యేక కోర్టు 18 నెలల జైలుశిక్ష, రెండు లక్షల రూపాయాల జరిమానా విధించింది. 27 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న దళితుల శిరోముండనం కేసులో త్రిమూర్తులును దోషిగా నిర్ధారించిన కోర్టు.. ఈ శిక్ష, జరిమానా విధించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో దళితుల శిరోముండనం (Venkatayapalem Shiromundanam Case) ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో ఎమ్మెల్యేగా తాను పోటీ చేసిన క్రమంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో ఐదుగురు దళితుల్ని హింసించి, వీరిలో ఇద్దరికి శిరోముండనం చేయించిన ఆరోపణలు తోట త్రిమూర్తులు( thota trimurtulu)పై ఉన్నాయి. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా కొనసాగింది.
దళితుల శిరోముండనం ఘటన చోటు చేసుకున్న 1996 నుంచి దాదాపు 150 సార్లు విచారణలు జరిగాయి. ఎట్టకేలకు విశాఖలోని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసుల ప్రత్యేక కోర్టు ఇవాళ శిక్ష ఖరారు చేసింది. శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రస్తుతం ఆ పార్టీ తరఫున మండపేట అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ కేసులో త్రిమూర్తులను దోషిగా నిర్దారించిన న్యాయస్ధానం జైలుశిక్షతో పాటు జరిమానాను కూడా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
అయితే రెండేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడటంతో ఆయన ఎన్నికల్లో పోటీకి ఎలాంటి ఇబ్బందులూ ఉండకపోవచ్చు.












Click it and Unblock the Notifications