Vanga Geetha: ఫలితాలకు ముందే వంగా గీత యూటర్న్- పవన్, చిరుపై కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపిన నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడమే ఇందుకు కారణం. అయితే ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ అభ్యర్ధి వంగాగీత, ఆమెకు మద్దతిచ్చిన ముద్రగడ పద్మనాభంతో పాటు సీఎం జగన్ వంటి వారు తీవ్ర విమర్శలు చేశారు. దీని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఫలితాలకు ముందే వైసీపీ అభ్యర్ధి వంగా గీత వెనక్కి తగ్గారు.
పిఠాపురం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వంగా గీత తాజాగా వెల్లడించారు. తన ఎన్నికల ప్రచారం గమనిస్తే ఎక్కడా, ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు, విమర్శలు చేయలేదని గీత చెప్పుకొచ్చారు. తన చుట్టూ ఉన్న వాళ్లు పవన్ పై విమర్శలు చేయమని చెప్పినా చేయలేదని, అలాగే వాళ్లు విమర్శించినా ఆపానంటూ గీత వెల్లడించారు. అలాగే మెగా ఫ్యామిలీపై తన అభిప్రాయం కూడా చెప్పేశారు.

తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం మీద తనకున్న గౌరవం వల్లే పవన్ కళ్యాణ్ పై ఎలాంటి వ్యక్తిగత దాడికీ దిగలేదంటూ వంగా గీత వెల్లడించారు. తద్వారా మెగా ఫ్యామిలీపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఒకప్పుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన వంగా గీత.. ఆ తర్వాత మాత్రం ఆయనతో పాటు కాంగ్రెస్ లోకి కూడా వెళ్లారు. కాంగ్రెస్ ఓటమి తర్వాత వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి మాత్రం పిఠాపురంలో వైసీపీ అభ్యర్ధిగా పవన్ పై పోటీ చేయాల్సిన పరిస్ధితి ఆమెకు ఎదురైంది. అయితే పవన్ పై విమర్శల కంటే తన గురించి చెప్పుకోవడానికే ఆమె ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు.












Click it and Unblock the Notifications