ఢిల్లీ కేంద్రంగా జగన్ అనూహ్య నిర్ణయం - మారుతున్న లెక్కలు, కీలక మలుపు..!?
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న ఆసక్తి కర పరిణామాల వేళ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. కేంద్రం - ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఈ సమయంలో ఢిల్లీ కేంద్రంగా జగన్ తాజా రాజకీయ కార్యాచరణ ఆసక్తి కరంగా మారుతోంది. 2029 ఎన్నికల దిశగా ఏపీలో ఇప్పటికే కొత్త వ్యూహాలను అటు కూటమి.. ఇటు వైసీపీ అమలు చేస్తున్నాయి. దీంతో, జగన్ తాజా కసరత్తు రాజకీయంగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారుతోంది.
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పైన డీఎస్సీ వ్యవహారంలో జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కొనసాగిస్తున్నారు. నిత్యం డీఎస్సీ వ్యవహారంలో ప్రశ్నలు సంధిస్తున్నారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయనేది జగన్ ఆరోపణ. అటు ప్రభుత్వం.. అధికారులు అక్రమాలు జరగలేదని.. వస్తున్న ఆరోపణల పైన విచారణ చేస్తామని చెబుతున్నారు. అయితే, జగన్ ఈ డీఎస్సీ అస్త్రంతో కూటమి ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన సీబీఐ తో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం పైనా బీజేపీ- జనసేన లక్ష్యంగానూ జగన్ విమర్శలు చేసారు. ఇక.. ఇప్పుడు ఇదే అంశం పైన ఢిల్లీ స్థాయిలో కొత్త కార్యాచరణ కు జగన్ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

జగన్ కీలక చర్చలు.. తుది నిర్ణయం..!
డీఎస్సీ అక్రమాల పైన సీబీఐ విచారణ డిమాండ్ తో కేంద్రంలోని ముఖ్య నేతలను కలిసే ఆలోచన లో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన ప్రధానికి లేఖ రాసారు. ఇక.. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద ధర్నాకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. అటు కేంద్రం మహిళా రిజర్వేషన్ - డీమిలిటేషన్ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక పార్లమెంట్ భేటీ తో పాటుగా అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో ఢిల్లీలో ఆందోళన చేయటం ద్వారా కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందని వైసీపీ నేతల అంచనా. ఇదే అంశం పైన జగన్ పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. ఢిల్లీలో ధర్నాపై తాజాగా జరిగిన మీడియా సమావేశంలోనూ స్పష్టత ఇచ్చారు. గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంలో జగన్ ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. ఇండియా కూటమికి చెందిన కొన్ని పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. కాగా.. ఇప్పుడు ఢిల్లీలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలని పార్టీ ముఖ్యులతో జగన్ కీలక చర్చలు చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా జగన్ తీసుకునే నిర్ణయం పైనా రాజకీయం గా ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications
