చంద్రబాబు ఇలాకాలో జగన్ కొత్త లెక్కలు - అభ్యర్దుల మార్పు, జాబితాలో..!!
ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. అభ్యర్దుల ఖరారు పైన కసరత్తు ప్రారంభించాయి. సీఎం జగన్ పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను మారుస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు చేస్తున్నామని చెబుతున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు వేళ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ అభ్యర్దుల ఎంపిక దాదాపు తది దశకు చేరుకుంది.
చిత్తూరు జిల్లా రాజకీయం : చిత్తూరు జిల్లా రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఈ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ విజయం సాధిస్తామని చెబుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతీ మూడు నెలలకోసారి మూడు రోజులు కుప్పంలో పర్యటిస్తున్నారు. కుప్పంకు వైసీపీ నుంచి తొలి అభ్యర్దిగా భరత్ ను ప్రకటించిన జగన్..ప్రత్యేకంగా నియోజకవర్గం పైన ఫోకస్ చేసారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. 2019 ఎన్నికల్లో చిత్తూరు నుంచి చంద్రబాబు మాత్రమే టీడీపీ నుంచి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో పట్టు నిరూపించుకొనేందుకు వైసీపీ వ్యూహాలు సిద్దం చేస్తోంది.

వైసీపీ అభ్యర్దుల పై కసరత్తు : చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముగ్గురు సిట్టింగ్ లను మార్చే ఆలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతల సమాచారం మేరకు దాదాపుగా అభ్యర్దుల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చారు. సీట్లు దక్కని వారికి ప్రత్యామ్నాయాల పైన హామీ ఇస్తున్నారు. కుప్పం - కె.ఆర్.జె.భరత్, పలమనేరు - వెంకటే గౌడ, పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, .మదనపల్లె - నిస్సార్ అహ్మద్ పేరు పరిశీలన లో ఉందని తెలుస్తోంది. ఇక్కడ 2019 లో మహమ్మద్ నవాజ్ బాషా గెలుపొందారు. తంబల్లపల్లి - పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పీలేరు - చింతల రామచంద్ర రెడ్డి, పూతలపట్టు - డా.యం. సునీల్ కుమార్ పేర్లు దాదాపు ఖాయమైనట్లు పార్టీ వర్గాల సమాచారం.

మార్పులు - చేర్పులు : చిత్తూరు నుంచి జంగనపల్లి శ్రీనివాసులు సిట్టింగ్ గా ఉన్నారు. కొత్తగా యంసి విజయానందరెడ్డి పేరు పరిశీలనలో ఉందని..జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. .జి.డి.నెల్లూరు - కె.నారాయణ స్వామి.చంద్రగిరి - సి.మోహిత్ రెడ్డి, తిరుపతి - బి.అభినయ్, నగరి - ఆర్.కె.రోజా, శ్రీకాళహస్తి - బి.మధుసూదన రెడ్డి పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సత్యవేడు లో సీటు మార్పుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక్కడ నుంచి ఎంపీ యం. గురుమూర్తి బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. దీని పైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మంత్రి రోజా సీటు ఈ సారి లేదని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, రోజా మరోసారి నగరి నుంచి పోటీ చేయటం ఖాయమైంది.












Click it and Unblock the Notifications