ఆటో డ్రైవర్ల పథకంపై వైసీపీ ఫైర్-మ్యానిఫెస్టోలో చెప్పిందేంటన్న పేర్ని నాని..
ఏపీలో ఇవాళ కూటమి సర్కార్ ఆటో డ్రైవర్లకు ఏటా 15వేలు ఇచ్చే పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఇవాళే తొలి ఏడాది డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈ పథకం అమలులో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని, గతంలో ఇచ్చిన హామీలకూ, ఈ పథకం అమలుకు పొంతన లేదంటూ విపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా ఆటో, లారీ, టిప్పర్ డ్రైవర్లకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, వారికి నేడు పండుగ కాదు.. దండుగ రోజుగా గుర్తుండేలా చేశారని వైసీపీ నేత పేర్ని నాని విమర్శించారు.
కూటమి పార్టీలు ఎన్నికల ముందు డ్రైవర్ల కోసం మేనిఫేస్టోలో ప్రకటించిన దానికి, నేడు చేస్తున్న దానికి ఏమాత్రమైనా సంబంధం ఉందా అని పేర్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో అర్హులైన లక్షలాది మంది ఆటోడ్రైవర్లు, లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఈ ప్రభుత్వం వంచన మిగిల్చిందన్నారు. వైసీపీ మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా వాహనమిత్ర ద్వారా అర్హులైన ప్రతి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు జగన్ అండగా నిలిచారని, కానీ ఇవాళ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని దుస్థితిలోనూ, తమ గొప్పతనాన్ని చంద్రబాబు సిగ్గులేకుండా చాటుకుంటున్నారని విమర్శించారు.

చంద్రబాబు, పవన్, లోకేష్‌లు మూడు ఖాకీచొక్కాలు వేసి ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరుతో భారీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్ని ఆరోపించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోడ్రైవర్లు బేరాలు లేక ఆందోళనకు దిగారని, ప్రభుత్వం తమ పొట్టకొట్టిందంటూ నిరసన కార్యక్రమాలు చేశారని, వారి ఆందోళనను చూసి కంగారుపడ్డ కూటమి సర్కార్ ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించిందన్నారు.
రాష్ట్రంలో 2,90,669 మంది ఆటోడ్రైవర్లకు రూ.436 కోట్లు డబ్బులు వేశామని, ఇటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదని, తానే తొలిసారిగా చేసినట్లు చంద్రబాబు చెప్పుకున్నారని, ఆయన గొప్పలు చూసి ఆటోడ్రైవర్లే అవాక్కయ్యారని పేర్ని నాని తెలిపారు. ఆటోస్టాండ్‌ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదని, తాను పెట్టబోయే యాప్ ద్వారా ఇంటి నుంచే బేరాలను అందుకోవచ్చని, రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, బేరాలు వచ్చేలా చేస్తానంటూ ఆటోడ్రైవర్లను ఊహాలోకంలో విహరింపచేశారన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ళలో గత ప్రభుత్వం కన్నా అదనంగా చంద్రబాబు ఇచ్చింది 15వేల మందికి మాత్రమే అన్నారు. ఎన్నికలకు ముందు మేనిఫేస్టోలో ఆటో డ్రైవర్లకు సాధికారిత సంస్థ ఏర్పాటు, ప్రమాదబీమా, హెల్త్ ఇన్సూరెన్స్, డ్రైవర్ల పిల్లకు విద్యారుణాలు, వాహన కొనుగోలుకు అయిదుశాతం వడ్డీ సబ్సిడీతో ప్రభుత్వపరంగా రుణాలు ఇస్తామని అన్నారని, బ్యాడ్జ్ కలిగిన ఆటోడ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ, టిప్పర్ డ్రైవర్లు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారని గుర్తుచేశారు. టీడీపీ మేనిఫేస్టో ప్రకారం లారీ, టిప్పర్ డ్రైవర్లకు డబ్బులు ఇవ్వలేదని, పెళ్ళైన ఆటోడ్రైవర్ కుటుంబసభ్యుల పేరుతో ఆటో ఉన్నా డబ్బు వేసేందుకు నిరాకరించారని, ఈ ప్రభుత్వం చేస్తున్న మేలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications