సుప్రీం తీర్పు గుర్తులేదా ? సోషల్ పోస్టుల కమిటీపై వైసీపీ ఫైర్..!
ఏపీలో కూటమి సర్కార్ పై వైసీపీ సోషల్ మీడియా వార్ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల్ని నియంత్రించేందుకు వీలుగా మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఐదుగురు మంత్రులతో ఈ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోషల్ మీడియా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానికి సిఫార్సులు చేయబోతోంది. ఈ నేపథ్యంలో కమిటీ ఏర్పాటుపై వైసీపీ ఆగ్రహం వ్యక్త చేసింది.
సోషల్ మీడియాపై మంత్రివర్గ ఉపసంఘం నియామకం రాజ్యాంగ ఉల్లంఘన అని వైసీపీ మాజీ మంత్రులు రాజన్నదొర, మేరుగ నాగార్జున, వేణుగోపాలకృష్ణ, మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. సోషల్ మీడియా అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, తనకు లేని అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతో ఇదంతా చేస్తున్నారని తెలిపారు.

గతంలో సోషల్‌మీడియా నియంత్రణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, కేంద్రం చేసిన చట్ట సవరణనే కొట్టివేసిందని వైసీపీ నేతలు గుర్తుచేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలన్నారు. అయినా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించేందుకు బరితెగిస్తున్నారన్నారు. ప్రశ్నిస్తున్నవారిని, అక్రమాలు, అవినీతి ఎండగడుతున్నవారి నోళ్లు మూయించే ప్రయత్నం
చంద్రబాబు పూర్తిస్థాయి నియంతలా మారిపోయారని ఆరోపించారు.

చంద్రబాబు తప్పుడు చర్యలకు కోర్టుల్లో ఎదురుదెబ్బ తప్పదని వైసీపీ నేతలు తెలిపారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడిపే లోకేష్ నేతృత్వంలో సోషల్ మీడియా నియంత్రణకు మంత్రివర్గ ఉప సంఘమా? అని ప్రశ్నించారు. ఇంతకన్నా విడ్డూరం ఉంటుందా?
అని నిలదీశారు. ఫేక్ ప్రచారాలు చేసిన చంద్రబాబు, లోకేష్‌లపైనే చర్య తీసుకోవాలన్నారు. ఇవన్నీ ఒక ఫక్తు నియంత చర్యలేనని, ఇవేమీకూడా కోర్టుల ముందు, ప్రజలముందు నిలబడవని గ్రహించాలన్నారు. పౌరుల హక్కులకు భంగం కలిగించిన వారు కాలగర్భంలో కలిసిపోతారని గుర్తుపెట్టుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications