ఎన్నికల వేళ సీఎం జగన్ కొత్త వ్యూహం - ముఖ్య నేతలకు పిలుపు..!!
రానున్న ఎన్నికలకు సీఎం జగన్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయం నుంచి సామాజిక సమీకరణాల్లో జగన్ పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లోనూ ప్రధాన ఓట్ బ్యాంక్ పైన ఫోకస్ చేసారు. సంక్షేమ పథకాల అమలుతో పాటుగా సామాజిక వర్గాలను ఆకట్టుకోవటంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
అందులో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద వర్గాల కోసం తాను.. తన కోసం ఆ వర్గాలు అంటూ ప్రతీ సందర్భంలోనూ చెబుతూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కీలక నిర్ణయాల దిశగా మరో కీలక భేటీకి రంగం సిద్దమైంది.

24న కీలక సమావేశం: ఎస్టీ వర్గాలకు మరింత దగ్గర చేసుకొనే వ్యూహాలకు వైసీపీ పదును పెడుతోంది. అందులో భాగంగా ఈ నెల 24న తాడేపల్లిలో ఎస్సీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగనుంది. ఎస్సీ ఓటింగ్ పైన వైసీపీతో పాటుగా టీడీపీ కూడా ఆశలు పెట్టుకుంది. ప్రతిపక్షాలు ఎస్సీల వ్యవహారంలో ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా తీసుకోవాల్సిన చర్యలతో పాటుగా, ఇంకా ఎస్సీ వర్గాలకు మంచి చేయగలిగిన అంశాల పైన ఈ సమావేశంలో చర్చించాలని భావిస్తున్నారు.
2019 అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి మరింతగా ఆ వర్గాల్లోకి తీసుకెళ్లాలని ఇప్పటికే నిర్ణయించారు. ఎస్సీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అవకాశం ఉంది.
ఐప్యాక్ సర్వే..సూచనలు: వైసీపీకి రాజకీయ వ్యూహాల్లో సహకారం అందిస్తున్న ఐ ప్యాక్ సంస్థ ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ప్రాధమిక కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. 24న జరిగే సమావేశానికి వైసీపీలోని ఎస్సీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక స్థానాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులను ఆహ్వానించారు. దళితులకు సంబంధించిన అధికారులు, పథకాల విషయంలో కొంత కాలంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నాయి.
వీటిని తిప్పికొట్టంతో పాటుగా వైసీపీ పాలనలో దళిత వర్గాలకు జరిగిన మంచి..పదవుల్లో లభించిన ప్రాధాన్యత గురించి ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జిల్లా స్థాయిల్లోనూ వీటి పైన అవగాహన కలిగించేలా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.
త్వరలో రాష్ట్ర స్థాయి సభ: గతంలో బీసీ రాష్ట్ర స్థాయి సభ విజయవాడలో నిర్వహించారు. ఇప్పుడు అదే తరహాలో ఎస్సీ సభ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర మంత్రివర్గం నుంచి గ్రామ స్థాయి వరకు ఈ నాలుగేళ్ల కాలంలో ఇచ్చిన ప్రాధాన్యత గురించి ఈ సభల ద్వారా వివరించాలనేది వైసీపీ వ్యూహం.
ఇందుకోసం ఈ సభ నిర్వహణ ఎక్కడ నిర్వహించాలనే దాని పైన నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టే క్రమంలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్న సమావేశాల దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది.












Click it and Unblock the Notifications