కేంద్ర బలగాలతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి: వైసీపీ డిమాండ్!
ఆంధ్రప్రదేశ్ లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను మోహరించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అభ్యర్ధులకు తగినంత భద్రత ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా కేంద్రాల్లో సమర్పించేందుకు అవకాశం కల్పించాలని . ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. వీటి కాపీల్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని కోరారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై రాజకీయ బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల భద్రత బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర పోలీసులకు అప్పగిస్తే నిష్పక్షపాత వాతావరణం ఉంటుందన్న నమ్మకం తమకు లేదన్నారు.ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, అధికార యంత్రాంగాన్ని లేదా ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు
కూటమి పాలనలో ప్రతిపక్ష అభ్యర్థులు బెదిరింపులు, దాడులు, రాజకీయ ప్రేరేపిత పోలీసు చర్యలు, రాజకీయ కార్యకలాపాలకు అడ్డంకులు ఎదుర్కొంటున్నారని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితులు ఎన్నికల సమయంలో తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడం, ప్రచారాన్ని నిరోధించడం వంటి పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక్క పోలింగ్ రోజు మాత్రమే భద్రత కల్పించడం సరిపోదని, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందే కేంద్ర బలగాలను మోహరించి, ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు ప్రకటించే వరకు కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, ప్రతిపాదకులు, మద్దతుదారులపై ఒత్తిళ్లు తీసుకురావడం ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని లేళ్ల అప్పిరెడ్డి లేఖలో పేర్కొన్నారు.
నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటి దృశ్యాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి కోరారు. సున్నితమైన ప్రాంతాల్లో స్వతంత్ర పరిశీలకులు, మొబైల్ పర్యవేక్షణ బృందాలను నియమించాలని సూచించారు. .అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా కేంద్రాల్లో సమర్పించేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.












Click it and Unblock the Notifications
