YSRCP: వైసీపీకి ప్రతిపక్ష హోదా కష్టమే ? జనసేన తర్వాత మూడో స్ధానం...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దారుణ పరాజయం అంచున ఉన్న వైఎస్సార్సీపీని మరిన్ని కష్టాలు చుట్టుముట్టేలా ఉన్నాయి. ఫలితాల్లో తాజా ట్రెండ్ ప్రకారం చూస్తే వైసీపీకి 15 సీట్లు లభించే అవకాశం ఉంది. దీంతో ఆ పార్టీకి ఈసారి అసెంబ్లీలో విపక్ష హోదా లభించడం కూడా కష్టంగా మారబోతోంది. కూటమి ప్రభంజనంలో కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ కంచుకోటల్లో ఓటమిపాలవుతున్న వైసీపీకి వచ్చే ఐదేళ్లలో ఇబ్బందికరమైన పరిస్ధితులు తప్పేలా లేవు.
ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. ఇందులో ఈసారి కూటమి దాదాపు 160 సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు కూటమి 160 సీట్లు దాటిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. దీంతో వైసీపీకి 15 సీట్లు లభించడం కూడా కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విపక్ష హోదా సాధించే పరిస్ధితి కూడా వైసీపీకి లేకుండా పోతోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లభించాలంటే కనీసం 18 సీట్లు అవసరం.

అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు లేదా అంత కంటే తక్కువగా వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో గత ఎన్నికల్లో 23 సాధించి అతి కష్టం మీద ప్రతిపక్ష హోదా అందుకున్న టీడీపీతో పోలిస్తే ఈసారి వైసీపీ పరిస్ధితి మరింత దారుణంగా మారబోతోంది. కారణాలు ఏవైనా అసెంబ్లీలో విపక్ష హోదా సాధించడంలో వైసీపీ విఫలమైతే మాత్రం ఆ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా లేవు. అదే జరిగితే వైఎస్ జగన్ కు ప్రోటోకాల్ లభించడం కూడా కష్టంగా మారే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications