WHY AP Needs JAGAN...వైసీపీ సర్కార్ మరో కొత్త కార్యక్రమం రెడీ..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. మరో ఏడాదిలోపే ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే నాలుగేళ్ల సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడో ఓ లోటు కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గడప గడపకూ ప్రభుత్వం పేరుతో తాము చేసిన పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లినా వాటిపైనా అక్కడక్కడా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ మరో హింట్ ఇచ్చారు.
ఏపీలో వైసీపీ సర్కార్ తరఫున మరో కొత్త కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఇవాళ జరిగిన వైసీపీ ఎమ్మెల్యేల భేటీలో సీఎం జగన్ సంకేతం ఇచ్చారు. అయితే జూలై 1 నుంచి ప్రారంభం కాబోతున్న జగనన్న సురక్ష కార్యక్రమం ముగిసిన తర్వాత దీన్ని ప్రారంభించబోతున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ అర్హులై ఉండి కూడా సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి వాటిని అందజేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత వై ఏపీ నీడ్స్ జగన్ (Why AP Needs Jagan ?) పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టాలని సీఎం జగన్ ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్న ఐప్యాక్ టీమ్ దీనిపై ఓ కార్యాచరణ అందించనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ తాము చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఏపీకి జగన్ అసలు ఎందుకు అవసరం అనే పేరుతో మరో రూపంలో ప్రజల్లోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమం, ఇతర కార్యక్రమాలు జగన్ తోనే సాధ్యమని భావిస్తున్న వైసీపీ సర్కార్.. ఆయన మరోసారి అధికారంలోకి రాకపోతే అవన్నీ ఆగిపోతాయని ప్రచారం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ సంక్షేమంపై పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ జనంలోకి వెళ్తున్నారు. వీరిని నమ్మొద్దంటూ ప్రభుత్వం ఓవైపు ప్రచారం చేస్తోంది. మరోవైపు తాము కూడా జగన్ ఎందుకు అవసరం అనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది.












Click it and Unblock the Notifications