
కనీసం 80 వేల మందితో వైసీపీ మహా సభ - పసందైన వంటకాల లిస్ట్ ఇదే..!!
అమరావతి: రాష్ట్రంలో వెనుకబడిన సామాజిక వర్గం ఓటుబ్యాంకుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ప్రభుత్వంలో బీసీలకు అధికారాన్ని కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. పెద్ద ఎత్తున వారిని భాగస్వామ్యులను చేస్తోంది. ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశాలను కూడా వైసీపీ పరిశీలిస్తోంది. 2024 నాటికి బీసీ ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవడంపై కసరత్తు మొదలు పెట్టింది. కర్నూలులో నిర్వహించిన రాయలసీమ గర్జన విజయవంతమైన రెండో రోజే దీన్ని చేపట్టింది.
వెంకయ్య
నాయుడు,
సుజన
చౌదరి
ప్రోద్బలంతోనే..:

రేపు మహాసభ..
ఇందులో భాగంగా బుధవారం విజయవాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఈ సభను ఏర్పాటు చేసింది. దీనికి జయహో బీసీగా నామకరణం చేసింది వైసీపీ అగ్రనాయకత్వం. ఉదయం 9 గంటలకు ఆరంభం కానున్న ఈ మహాసభ సాయంత్రం వరకు కొనసాగుతుంది. దీనికి రాష్ట్రంలోని బీసీ సర్పంచులు జడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరు కానున్నారు.

80 వేల మంది..
పట్టణ స్థాయిలో ఉన్న ఆలయ కమిటీ ప్రతినిధులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు.. పాల్గొననున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 80 వేల మందికి పైగా బీసీ ప్రజా ప్రతినిధులు ఈ సభకు హాజరవుతారని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. కొన్ని కీలక తీర్మానాలను ఈ మహాసభలో ఆమోదించే అవకాశం ఉంది. బీసీలకు మరింత రాజ్యాధికారాన్ని కట్టబెట్టే దిశగా నిర్ణయాలు, తీర్మానాలు ఉంటాయని చెబుతున్నారు.

కీలక నిర్ణయాలు..
2024 సార్వత్రిక ఎన్నికల్లో వారికే అత్యధిక టికెట్లను కేటాయించడం కూడా ఇందులో ఒకటిగా ఉంటుందని సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇటీవలే పార్టీకి చెందిన సీనియర్ బీసీ నాయకులు ఈ సభ ఏర్పాటు గురించి చర్చించిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి దీనికి అధ్యక్షత వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, కొలసు పార్థసారథి, మాజీ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.

చురుగ్గా ఏర్పాట్లు..
జయహో బీసీ మహాసభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బీసీ సామాజిక వర్గానికే చెందిన మంత్రి జోగి రమేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బలహీనవర్గాలకు అండగా వైఎస్ జగన్ నిలిచారని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు, ఆలోచనలను ఆచరణలో చూపించారని కితాబిచ్చారు. సామాజిక న్యాయాన్ని పాటించిన నాయకుడిగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో వైఎస్ జగన్ నిలిచిపోయారని అన్నారు.

మెనూ ఇదే..
ఈ మహాసభ కోసం వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం ప్రత్యేక వంటకాలు చేయిస్తోంది. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, గారె, మసాలా ఉప్మా, పొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ, స్వీట్ - రవ్వ కేసరి, కాఫీ/టీ ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో మటన్ బిరియానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొయ్యలు, కోడిగుడ్డు కర్రీ, చాపల పులుసు, ఖట్టా, ఉల్లి చట్నీ, వైట్ రైస్, పెరుగు, చక్కెర పొంగలి వడ్డిస్తారు. శాకాహారంగా వెజ్ బిరియానీ (పనసకాయ ధమ్ బిరియానీ), పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ, డబుల్ బీన్స్ జీడిపప్పు కర్రీ, ఉల్లి చట్నీ, పప్పు టమోటా, గోంగూర పచ్చడి, వైట్ రైస్, సాంబారు, పెరుగు, చక్కెర పొంగలి ఉంటుంది.