ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఏదీ ? పీఆర్సీ, పెన్షన్ నో క్లారిటీ ? మాజీ ఎన్జీవో నేత ఫైర్..!
ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.26 వేల కోట్ల బకాయిలపై ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ఏపీ ఎన్జీవోల మాజీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ కు సలహాదారుగా పనిచేసిన నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ ప్రశ్నించారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన 9 హామీలను గాలికొదిలేశారని, తక్షణం అమలు చేస్తామన్నవీ అస్సలు పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. కనీసం 12వ పీఆర్సీ వేయకపోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. ఏ పెన్షన్ స్కీమ్ ఉందో ఉద్యోగులకు అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. సీపీఎస్, జీపీఎస్, ఓపీఎస్..లపై స్పష్టత ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు రకరకాల హామీలతో ఉద్యోగులకు మాయ మాటలు చెప్పిన కూటమి పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక బొత్తిగా పట్టించుకోవడం మానేశారని, ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలైనా మేనిఫెస్టోలో ప్రకటించిన 9 హామీల్లో కనీసం ఒక్కటి కూడా అమలు చేయలేదని చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులకు ప్రభుత్వమే రూ.26 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, సంక్రాంతి సందర్భంగా ఇస్తామన్న రూ.1300 కోట్లు, పండగ ముగిసి వారమైనా విడుదల చేయలేదని ఆక్షేపించారు.

పాత పీఆర్సీ బకాయిలు, ఇతర బకాయిలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఈఎల్స్ ఎన్‌క్యాష్‌మెంటు, జీపీఎఫ్, ఏపీ జీఎల్‌ఐ, మెడికల్ రీయింబర్స్‌మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి దాదాపు రూ.26 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. వెంటనే అవన్నీ చెల్లించాలన్నారు. సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులకు రూ. 1300 కోట్లు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్భాటంగా ప్రకటించినప్పుడు తమ డబ్బులు తమ కివ్వడం కూడా గొప్పేనా అని ఆశ్చర్యపోయామన్నారు.. సంక్రాంతి ముగిసి వారం దాటినా ఉద్యోగులకు అవీ చెల్లించిన పాపాన పోలేదన్నారు.
సంక్రాంతి కానుక కింద రూ.250 కోట్లు టీడీఎస్ ఇస్తున్నామని మంత్రి ప్రకటించినప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి ఉద్యోగులది అన్నారు. ఎందుకంటే ఆదాయపు పన్ను కట్టే ప్రభుత్వ ఉద్యోగులకు టీడీఎస్ కట్ కాదని, మరి ఆ డబ్బు ఎవరికి చెల్లిస్తున్నారో ఎందుకు చెల్లిస్తున్నారో అయోమయం నెలకొందన్నారు. సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని వెలువరిస్తామన్న ప్రభుత్వం.. ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదన్నారు. సీపీఎస్, జీపీఎస్, ఓపీఎస్‌లో ఏ విధానంలో కొనసాగుతున్నామో ఉద్యోగులకు అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు.
మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, 2023 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయాల్సి ఉన్నా అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల్లో కనీసం పే రివిజన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఉద్యోగులకు వచ్చే అలవెన్సులు తక్కువగా ఉన్నాయని, అధికారంలోకి వచ్చాక పునఃపరిశీలన చేసి అలవెన్సులు పెంచుతామని హామీ ఇస్తే.. హెచ్‌ఆర్‌ఏ పెంచుతారని ఆశించిన ఉద్యోగులకు భంగపాటు తప్పలేదన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే ఉద్యోగులు, పెన్షనర్లకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామని హామీ ఇచ్చి, నెరవేర్చలేదని, ఇప్పుడు కనీసం 30 శాతం తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలని చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ప్రతినెలా ఒకటో తారీఖున పెన్షన్లు, జీతాలు ఇస్తామని చెప్పిన హామీ మొదటి రెండు నెలలకే పరిమితమైందన్నారు. గడిచిన నాలుగులు నెలలుగా 5, 6 తేదీల తర్వాతనే జీతాలు చెల్లిస్తున్నారన్నారు. పెన్షనర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు హామీ నిలబెట్టుకోవాలన్నారు.
వాలంటీర్ల వేతనాలు రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని లేనిపోని ఆశలు కల్పించారని, ఎన్నికల్లో వాడుకుని అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచకపపోగా.. కనీసం వారిని ఉద్యోగాల్లో చేర్చుకోకుండా, జీతాలు చెల్లించకుండా వేధిస్తున్నారన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యోగులకు ఇచ్చిన 9 హామీలు తక్షణం అమలు చేయాలన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ పెండింగ్ పెట్టిన రెండు డీఏ బకాయిలు చెల్లించాలన్నారు.












Click it and Unblock the Notifications