వాళ్లిద్దరి ఆటలు సాగేది ఇంకో 10 రోజులే
Goutham Reddy: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. ధీమాగా ఉంటోన్నాయి.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

పోలింగ్ రోజు, ఆ తరువాతా అల్లర్లు, దాడులు- ప్రతిదాడులతో నరసరావుపేట అట్టుడికిపోయిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే, మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతం వెలుగులోకి వచ్చాకా.. నరసరావుపేట పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. పాల్వాయిగేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎంలను ఆయన ధ్వంసం చేయడం కలకలం రేపింది.
ఈ పరిణామాలపై వైఎస్ఆర్సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కలలు కనడానికి ఇంకో 10 రోజులే అవకాశం ఉందని అన్నారు. పెత్తందారులకు అధికారం వస్తే అత్యంత ప్రమాదకరమని పేదలు గ్రహించారని, అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పారు.
మహిళలు ఏకంగా 89 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయానికి తొలి సంకేతమని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ కూడా జగన్‌కు బాసటగా నిలిచాయని అన్నారు.
పల్నాడులో గొడవలకు తెరలేపి ఆ ప్రాంతాన్ని రావణకాష్టంలా మార్చడానికి టీడీపీ కుట్రలు పన్నిందని గౌతమ్ రెడ్డి విమర్శించారు. దీనికి ఎన్నికల సంఘంలోని కొంత మంది సహకరించారని ఆరోపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన వీడియో ఎలా లీక్ అయిందని ఆయన ప్రశ్నించారు. ఈసీ వద్ద ఉండాల్సిన ఆ వీడియోను నారా లోకేశ్ తన ఎక్స్ అకౌంట్‌లో ఎలా పోస్ట్ చేశారని నిలదీశారు.
ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేసిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయని, వారి మీద ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని గౌతమ్ రెడ్డి అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశామని చెబుతున్న ఈసీ.. పిన్నెల్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నారా లోకేష్‌పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications