డీఎస్సీ అక్రమాల డొంక కదులుతోంది, ధైర్యం ఉందా - పేర్ని నాని..!!
వైసీపీ ముఖ్య నేత పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. అర్హత లేని తమ వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో లక్షల రూపాయలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. స్వయంగా ప్రజలే ఆధారాలతో సహా ఈ పాపాలను బట్టబయలు చేస్తున్నా, ప్రభుత్వం ఇంకా బుకాయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. 'యువగళం' కోటా కింద, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అర్హత లేని తమ వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో లక్షల రూపాయలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారని పేర్ని నాని ఆరోపించారు.
డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ-2025లో ఎంపికైన అభ్యర్థుల టెట్ స్కోర్, కేటగిరీ, సబ్జెక్ట్ అర్హత, కేటాయించి న పోస్టును కంప్యూటర్ ఆధారంగా క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమా? అని నాని సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర థర్డ్ పార్టీ ఏజెన్సీ అయిన సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీవో నం. 15 ప్రకారం టీచర్ ఉద్యోగం రావాలంటే టెట్ అర్హత తప్పనిసరని.. ఏ కోటాలో వచ్చినా ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పారు. బీసీలకు 75 మార్కులు రావాల్సి ఉండగా, కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఒల్లూరు ప్రాథమిక పాఠశాలలో కేవలం 65 మార్కులు వచ్చిన ప్రభాకర్ అనే వ్యక్తికి ఎస్జీటీ ఉద్యోగం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 150 మార్కులకు కనీస అర్హత సాధించని అభ్యర్థి ఆన్‌లైన్ దరఖాస్తును కంప్యూటర్ ఎలా స్వీకరిం చిందో చెప్పాలన్నారు. డీఈవోలు, ఐఏఎస్ అధికారులు ఎదురెదురుగా కూర్చుని స్క్రూటినీ చేశా మని చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు. ఈ అనర్హుడిని ఎలా ఎంపిక చేశారని నిలదీసారు.

ఆధారాలు బయటకు వస్తున్నాయంటూ..
కర్ణాటక సరిహద్దున ఉన్న కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఏకంగా 24 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లను నియమించారని నాని వివరించారు. ఒక్క ఒల్లూరు స్కూల్‌లోనే ఐదుగురు స్పోర్ట్స్ కోటా వాళ్లే పాఠాలు చెబుతున్నారన్నారు. 41 ఏళ్ల వయసులో 2009-10 నాటి జూడో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే, 42 ఏళ్లకు టీచర్ కొలువు ఇచ్చేశారని వివరించారు. జూడో ఆడేవాళ్లే లేని రాష్ట్రంలో 30-40 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు ఇంత జరుగుతుంటే ఎంఈవో, డీఈవో ఆఫీసుల్లో కాకుండా 'గోతులదొడ్డి' స్కూల్లో చీకట్లో రహస్య విచారణలు ఎందుకు జరుపుతున్నారని నిలదీసారు. అసలు జరగని టోర్నమెంట్లకు ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చిన వారికి కొలువులు కట్టబెట్టారని నాని ఆరోపించారు. డీఎస్సీ అక్రమా పై సీబీఐ లేదా థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని పేర్ని నాని డిమాండ్ చేసారు.













Click it and Unblock the Notifications