ఉండవల్లి ఇంట్లో వైసీపీ మాజీలు ..! సీక్రెట్ చర్చలు..! ఏం జరుగుతోంది ?
ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. అదే సమయంలో వైసీపీని టార్గెట్ చేసేందుకు అందివచ్చిన అవకాశాల్ని వాడుకుంటూ వైసీపీని టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా మద్యం స్కాంలో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు. త్వరలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు ఇవాళ రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యారు.
రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్‌ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, వైసీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం తదితరులు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఉన్న పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ములాఖత్‌లో కలిసి పరామర్శించేందుకు నగరానికి వచ్చిన వారు ఉండవల్లి నివాసానికి వెళ్లారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ను రాజకీయ మేథావిగా పేరుంది. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా రాజకీయ వ్యాఖ్యలు చేయడంలో మాత్రం ఆయన చురుగ్గానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్దితులను ఉండవల్లితో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు చర్చించి ఉంటారని తెలుస్తోంది. అలాగే కూటమిని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు కూడా కోరి ఉండొచ్చని సమాచారం.
వాస్తవానికి గతంలో వైసీపీకి అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్.. జగన్ కు కూడా సలహాలు ఇచ్చారు. ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఉండవల్లి అంటే ఇప్పటికీ వైసీపీలో చాలా మందికి ఎంతో గౌరవం ఉంది. అలాగే ప్రస్తుతం కూటమి సర్కార్ పనితీరుపైనా ఉండవల్లి అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీలు ఉండవల్లిని కలవడం ప్రాధాన్యం సంతరిచుకుంది. పైకి మాత్రం ఇది మర్యాదపూర్వక భేటీయేనని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications