ఆ రెండు అస్త్రాలపైనే వైసీపీ నమ్మకం - ఓట్లు కురిపిస్తాయా..!!
ఏపీలో గెలుపే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. ఇక ఎన్నికల వరకు పార్టీ శ్రేణులంతా ప్రజల్లోనే ఉండేలా సీఎం జగన్ కార్యాచరణ సిద్దం చేసారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా రెండు ప్రధాన అస్త్రాలుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నాలుగున్నారేళ్ల కాలంగా చేస్తున్న సంక్షేమం - సామాజిక న్యాయం ప్రజలకు వివరించేందుకు బస్సు యాత్ర ప్రారంభించారు. వై ఏపీ నీడ్స్ జగన్ పేరు తో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రజల్లోకి వెళ్తోంది.
బస్సు యాత్ర కొనసాగింపు : వైసీపీ బస్సు యాత్ర రెండో రోజుకు చేరింది. ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమలలో తొలి రోజు బస్సు యాత్ర నిర్వహించారు. నేడు రెండో రోజు గజపతినగరం, నరసాపురం, తిరుపతిలో యాత్ర జరగనుంది. తిరుపతిలో యాత్రతో పాటుగా సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఎంపీ విజయసాయిరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధు సూదన్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల నాయకులు పాల్గొనున్నారు.గజపతినగరంలో మధ్యాహ్నాం బహిరంగ సభ నిర్వహించనున్నారు. నరసాపురం మొగల్తూరు సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం రామాలయం సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.

సంక్షేమ ఓట్ బ్యాంక్ : పార్టీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రపై పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ నాలుగేళ్లలో జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సు యాత్రలో ఎలుగెత్తి చాటాలని, తద్వారా రాబోయే రోజుల్లో పెత్తందారులతో జరిగే యుద్ధంలో పేదవాడి విజయానికి బాటలు వేయాలని ఆకాంక్షించారు.
మన ప్రభుత్వంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశచరిత్రలోకూడా మునుపెన్నడూ చూడనిది. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించింది. గత 53 నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75శాతం ఈ వర్గాలకు చేరడమే దీనికి నిదర్శనం అని సీఎం జగన్ తన ట్వీట్‌లో ప్రస్తావించారు.
సామాజిక సమీకరణాలు : నాలుగున్నారేళ్ల కాలంలో 2.45 లక్షల కోట్ల మేర సంక్షేమ పథకాలు అందించామని ప్రభత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక..జనవరి నుంచి 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకూ పెన్షన్ ను రూ 3000కి పెంచనున్నారు. అదే విధంగా జనవరి నుంచి మార్చి నెలాఖరులోగా ప్రధాన పథకాల లబ్దిదారులకు భారీ మొత్తంగా చివరి విడత నిధులు విడుదల చేయనున్నారు.
అదే సమయంలో సామాజిక సమీకరణాలను ప్రభావితం చేసే విధంగా సామాజిక న్యాయం అమలు దిశగా అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు జరుగుతోంది. ఈ రెండు అస్త్రాల ద్వారా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలనేది సీఎం జగన్ వ్యూహం. మరి..ప్రతిపక్షాలు ఈ సంక్షేమ ఓట్ల యుద్దంలో ఎలాంటి పోటీ ఇస్తాయి..ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications