మోడీ నోరు విప్పాల్సిందే- వైసీపీ మంత్రి అమర్నాథ్ డిమాండ్..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శల పర్వం కొనసాగుతోంది. అయితే అదే సమయంలో వైసీపీ, విపక్ష ఎన్డీయే కూటమికీ మధ్య జరుగుతున్న పోరు కూడా మలుపులు తిరుగుతోంది. ఇన్నాళ్లూ ప్రధాని మోడీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన వైసీపీకి ఇప్పుడు ఎన్నికల వేళ ఎన్డీయేతో పోరులో భాగంగా ఆయన్నూ టార్గెట్ చేయక తప్పడం లేదు. దీంతో వైసీపీ మంత్రి అమర్నాథ్ మోడీ ముందు కీలక డిమాండ్ పెట్టారు.
ప్రధాని మోడీ ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై జనంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో రాజకీయ పార్టీలు ఎవరికి వారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమంటే, మేం వ్యతిరేకమంటూ చెప్పుకుంటున్నాయి. వైసీపీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి దీనిపై ప్రధాని మోడీని టార్గెట్ చేయడం మొదలుపెడుతోంది.

ఇందులో భాగంగా వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. మోడీ అనకాపల్లి బహిరంగసభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ విధానం ఏంటో ఆయన స్పష్టం చేయాలన్నారు. అనకాపల్లిలోనే ప్రధాని దీనిపై క్లారిటీ ఇస్తే జనం ఎన్డీయే కూటమిని నమ్ముతారని తెలిపారు. అంతే తప్ప ఎన్డీయే నేతలు చెప్తున్న మాటల్ని జనం నమ్మే పరిస్ధితుల్లో నమ్మడం లేదన్నారు.
వాస్తవానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం గత రెండేళ్లలో తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే వైసీపీతో పాటు ఇతర విపక్షాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తుండటంతో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఆలోపు స్టీల్ ప్లాంట్ కు బొగ్గు కొరత, ఇతర ముడి సరుకు కొరతలు కూడా తలెత్తాయి. దీనిపై రాష్ట్రంలో అధికార, విపక్షాలు మాట్లాడలేని పరిస్ధితి. తాజాగా గాజువాక వెళ్లిన సీఎం జగన్ ను ప్లాంట్ కార్మిక నేతలు కలిశారు. వారు నిలబెట్టిన అభ్యర్ధిని తప్పించి, వైసీపీ అభ్యర్ధి అమర్నాథ్ కు ఓట్లు వేయించాలని జగన్ సూచించారు.












Click it and Unblock the Notifications