వైఎస్ జగన్-చిరంజీవి ముఖాముఖి?: మెగాస్టార్‌ను ఇంటికెళ్లి ఆహ్వానించిన వైసీపీ ఎమ్మెల్యే
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ.. వాల్తేర్ వీరయ్య. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీన విడుదల కానుందీ మూవీ. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. కేఎస్ రవీంద్ర దర్శకుడు. రవితేజ ప్రత్యేక పాత్రను పోషించారు. శనివారమే ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకొంది. ఆచార్య తరువాత చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఇదే.

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య ఓ డిజాస్టర్ గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. పైగా ఇది చిరంజీవి హోమ్ ప్రొడక్షన్ కూడా. కోట్లాదిమంది చిరంజీవి అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసిందీ సినిమా. రామ్ చరణ్ తో కలిసి నటించినా గానీ ప్రేక్షకులు ఈ సినిమాను ఏ మాత్రం ఆదరించలేదు. ఆయనకు భారీ నష్టాన్ని మిగిల్చింది ఇది.
ఆచార్య తరువాత వస్తోన్న మూవీ కావడం, చిరంజీవి గల్ల లుంగీ, పూలచొక్కాతో పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తోండటంతో వాల్తేర్ వీరయ్యపై హైప్ క్రియేట్ అయింది. దీనికి అనుగుణంగా ట్రైలర్ టాక్ కూడా అదరగొట్టింది. ఆయనకు తోడుగా మాస్ మహారాజా రవితేజ కూడా తెరను పంచుకోవడం సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై 140 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది మూవీ.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు చిరంజీవి. విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్నారు. టీవీ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సన్నద్ధమౌతోన్నారు. సంక్రాంతి పండగ కూడా వస్తోండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మెగాస్టార్ మరింత ముమ్మరం చేశారు.
ఈ పరిణామాల మధ్య- చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు చింతల రామచంద్రా రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారు. ఆయనతో సమావేశం అయ్యారు. ఈ నెల 27వ తేదీన చింతల రామచంద్రారెడ్డి కుమారుడు సాయి కృష్ణారెడ్డి- శ్రీయ వివాహ మహోత్సవానికి హాజరు కావాలని కోరారు. చిరంజీవికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. సుమారు అరగంటకు పైగా అక్కడే గడిపారాయన.

చింతల రామచంద్రా రెడ్డి ఇదివరకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ వివాహానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. తన కుటుంబ సభ్యులతో వెళ్లి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ ను కలిశారాయన. ఆహ్వాన పత్రికను అందజేశారు. సొంత పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కావడంతో ఈ పెళ్లికి వైఎస్ జగన్ హాజరు కావడం ఖాయమైంది. ఇక చింతల రామచంద్రారెడ్డితో తనకు ఉన్న అనుబంధం నేపథ్యంలో- చిరంజీవి కూడా ఈ పెళ్లికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. దీనితో వైఎస్ జగన్- చిరంజీవి ముఖాముఖి కలుసుకోవచ్చు.












Click it and Unblock the Notifications