వైసీపీ హైకమాండ్ పై కామెంట్స్ - గొల్ల బాబూరావు యూటర్న్- తప్పుడు వార్తలంటూ వివరణ
వైసీపీ అధిష్టానం మంత్రి పదవి విషయంలో తనను దెబ్బ కొట్టిందని, తానూ అవకాశం వచ్చినప్పుడు దెబ్బ కొడతానంటూ చేసిన వ్యాఖ్యలపై పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వెనక్కి తగ్గారు. తాను హింసావాదినంటూ చేసిన వ్యాఖ్యలపైనా యూటర్న్ తీసుకున్నారు. ఈ వార్తలన్నీ అవాస్తవమేనంటూ ఇవాళ వివరణ ఇచ్చారు.
కోటారవుట్లలో గొల్ల బాబూరావు నిన్న వాలంటీర్ల సన్మాన కార్యక్రమం సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ కావడంతో అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. తాను హింసావాదిని కాదని, అహింసా వాదినే అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని అన్నారు.
అధిష్టానం మీకు అన్యాయం జరిగిందంటూ మీడియా అడిగిన ప్రశ్నకు అధిష్టానం ను అడగమని చెప్పానే తప్ప అధిష్టానానికి వ్యతిరేకమని చెప్పలేదని బాబారావు తెలిపారు.

2009 వరకూ ప్రభుత్వ అధికారిగా పనిచేసిన తనను పిలిచి దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాయకరావుపేట ఎమ్మెల్యే సీటు ను కేటాయించారని, ఆయన హయాం నుంచే వై.ఎస్.ఆర్ పార్టెకి విధేయుడు గానే ఉన్నానన్నారు. ఇప్పుడు కూడా పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నానన్నారు. దివంగత నేత ఆకస్మిక మరణం కలచి వేసిందని, ఆ బాధతో అప్పట్లో మొదటిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసానన్నారు. 2019 లో తనకు టిక్కెట్ ఇవ్వొద్దని చాలా మంది చాలా రకాలుగా అధిష్టానానికి చెప్పినా.. టిక్కెట్ కేటాయించిన జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ రుణ పడి ఉంటానన్నారు.
అధిష్టానం కష్టాల్లో ఉన్నపుడే వారి వెంట ఉన్న విధేయుల్లో తాను మొదటి వరుసలో ఉంటానని బాబూరావు తెలిపారు.
తన నియోజకవర్గ కార్యకర్తల్లో ఆవేదనను తెలిజేసే ప్రయత్నంలో ఇంతకుముందు హింసావాదిగా ఉండేవాడిని ఇప్పుడు అహింసా వాదిగా మారానని చెప్పానే తప్ప మరో విధంగా చెప్పలేదన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో తనపై కుట్ర పూరిత రాజకీయం జరుగుతున్న మాట వాస్తవమే కానీ తాను వారికి గాని, అదిష్టానానికి గాని ఎప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. తాను ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటానని, ఆ విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తనకు కష్టం వస్తే నేనే స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటాను తప్ప ఇటువంటి ప్రచారాలు చేయనన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేకపోతే సజ్జల రామకృష్ణ వారి ద్వారా అయినా నా కష్టం ను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానన్నారు.












Click it and Unblock the Notifications