వైసీపీకి పోటీ నామినేషనా ? పథకాలు కట్ చేస్తాం- ఎమ్మెల్యే జోగి రమేష్ హెచ్చరికలు
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం లేదంటూ ఎస్ఈసీకి తామర తంపరగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందులో అదికంగా అధికార వైసీపీకి వ్యతిరేకంగా ప్రత్యర్ధులు చేస్తున్న ఫిర్యాదులే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వైసీపీకి పోటీగా నామినేషన్ వేసే ప్రత్యర్ధి పార్టీ నేతలపై అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన కామెంట్లు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన ఈ కామెంట్లు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.

ప్రత్యర్ధులకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వార్నింగ్
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడుతున్న వైసీపీ అభ్యర్ధులకు పోటీగా నామినేషన్లు భారీ ఎత్తున దాఖలుకావడంపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసే వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే అధికార పార్టీ నేతలపై పోటీకి దిగుతారా అంటూ ప్రత్యర్ధులపై ఉరిమారు. దీంతో ప్రత్యర్ధులు ఆయన కామెంట్లతో బెంబేలెత్తుతున్నారు. ఈ వ్యవహారంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

పోటీ నామినేషన్లు వేస్తే పథకాలు కట్
ఏపీలో వైసీపీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసే ప్రత్యర్ధులకు ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్యే బహిరంగ హెచ్చరికలపై ప్రత్యర్ధులు మండిపడుతున్నారు. వార్డు మెంబర్‌గా పోటీచేసినా.. ప్రభుత్వ పథకాలు తీసి పారేయాలంటూ అధికారులకు ఆయన సూచించారు. మన పథకాలు తీసుకుంటూ మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ వివాదాస్పద కామెంట్లు చేసారు. సీఎం జగన్ అనేక పథకాలు అమలు చేస్తున్నా.. వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తాం అంటూ జోగి తీవ్ర హెచ్చరికలు చేశారు.

పెరుగుతున్న పోటీపై వైసీపీ అసహనం ?
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ పోరులలో సాధ్యమైనన్ని ఎక్కువ ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వయంగా సీఎం జగన్ టార్గెట్లు పెట్టారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ చెప్తున్నారు. అయితే ప్రభుత్వం అభీష్టానికి వ్యతిరేకంగా పలుచోట్ల విపక్షాలు, స్వతంత్ర అభ్యర్ధులు బరిలోకి దిగుతున్నారు. దీంతో వైసీపీ నేతల్లో అసహనం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే జోగి రమేష్ ఇలాంటి కామెంట్లు చేశారా అన్న చర్చ సాగుతోంది.

జోగి రమేష్ వ్యాఖ్యలపై ఎస్‌ఈసీకీ టీడీపీ ఫిర్యాదు
పంచాయతీ ఎన్నికల్లో తమకు పోటీగా నామినేషన్లు వేసే వారికి ప్రభుత్వ పథకాలు తొలగిస్తామంటూ పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఎస్ఈసీకి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. అధికార పార్టీ నేతగా తమకున్న పలుకుబడిని ఉపయోగించి ప్రత్యర్ధులను బెదిరించడమేంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ నేతల ప్రభావం ఉన్న పంచాయతీల్లో వైసీపీ ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్లు చేస్తుంటే మిగతా చోట్ల పరిస్ధితి ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై చర్యలు తీసుకోవాలని వారు ఎస్ఈసీని కోరబోతున్నారు.












Click it and Unblock the Notifications