ఏపీలో జగన్ దేవాలయం-శ్రీకాళహస్తిలో రెడీ- ఎమ్మెల్యే మధు వీరాభిమానం-రాష్ట్రంలో తొలిసారి
ఏపీలో వైసీపీ ఏర్పాటై 11 ఏళ్లు పూర్తవుతున్నాయి. సీఎం జగన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి 12 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటివరకూ రాష్ట్రంలో ఏ ప్రజా నేతా సంపాదించుకోని ఓ అరుదైన అభిమానాన్ని సంపాదించుకున్న జగన్ కు ఇప్పుడు రాష్ట్రంలో తన సొంత పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు సాధారణ జనం కూడా నీరాజనం పడుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు తాజాగా జగన్ కు ఏకంగా తన నియోజకవర్గంలో గుడి కట్టేశారు. జగన్ ను దేవుడితో పోలుస్తూ వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను కూడా అందులోనే చేర్చి దీన్ని నిర్మించారు. దీంతో ఇదో సంచలనంగా మారింది.

జగన్ ప్రస్ధానం
ఏపీ రాజకీయాల్లో తలపండిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా 2009లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్.. అనతికాలంలోనే తండ్రిని కోల్పోయారు. అయితే ఇది మరో రకంగా జగన్ కు కలిసివచ్చింది. స్వయంగా తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు అవకాశం కల్పించింది. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా వెరవకుండా ఎదుర్కొన్న జగన్ ఇప్పుడు ఏపీలో అత్యంత జనాదరణ కలిగిన నేతగా ఎదిగిపోయారు. ప్రత్యర్ధులు మోనార్క్ గా విమర్శిస్తున్నా ప్రజల్లో మాత్రం జగన్ ఆదరణ చెక్కుచెదరకుండా ముందుకు పోతోంది. వైసీపీ నేతల్లో అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు, నేతల్ని దేవుళ్లుగా కొలిచే సంప్రదాయం లేని ఏపీలో ఇప్పుడు జగన్ దేవుడిగా మారిపోతున్నారు.

గుళ్లు కట్టే స్దాయికి జగన్
ప్రజల్లో ఆదరణ సంపాదించుకునే నేతలకు విగ్రహాలు పెట్టడం పరిపాటి. ఇప్పటివరకూ ఏపీ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారి విగ్రహాలు ఇప్పటికీ రాష్ట్రంలోని వాడవాడలా దర్సనమిస్తుంటాయి. కానీ వీరికి ఎక్కడా గుళ్లు కట్టిన దాఖలాలు మాత్రం లేవు. కానీ ఏపీలో రెండేళ్ల క్రితం కనీవినీ ఎరుగని స్ధాయిలో చారిత్రక విజయం సాధించి అధికారం చేపట్టిన జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న అభిమానం గుళ్లు కట్టే స్దాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కు గుళ్లు కట్టేందుకు సిద్ధమవుతుండటం ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనే చర్చనీయాంశంగా మారుతోంది.

జగన్ కు గుడి కడుతున్న తొలి ఎమ్మెల్యే
సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలతో పేదల గుండెల్లో దేవుడిగా మారుతున్నారని, అందుకే తాను ఆయనకు గుడి కట్టాలని నిర్ణయించినట్లు పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గతంలో ప్రకటించారు. పేదల ఇళ్ల స్ధలాలకు కేటాయించిన స్ధలం పక్కనే జగన్ కు గుడి కడతానని ఆయన వెల్లడించారు. ఆ గుడి నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది. దీంతో వైఎస్ జగన్ కు రాష్ట్రంలో తొలిసారిగా గుడి కట్టిన ఎమ్మెల్యేగా తలారి వెంకట్రావు పేరు చరిత్రలో నిలిచిపోతుందని అంతా భావించారు. కానీ ఆ గుడి ఇంకా పూర్తి కాలేదు. ఆలోపే మరో వైసీపీ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు.

జగన్ కు గుడి కట్టిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి
సీఎం జగన్ కు గుడి కట్టేందుకు ఓవైపు పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో ప్రయత్నాలు జరుగుతుండగానే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోనూ స్దానిక వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ గుడి నిర్మాణం కూడా పూర్తయింది. దీంతో త్వరలోనే ఈ గుడిని ప్రారంభించేందుకు మధుసూధన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ గుడి నిర్మాణం ద్వారా జగన్ పై తన అభిమానం చాటుకోవాలని ఆయన భావిస్తున్నారు. అసెంబ్లీలో జగన్ పై విపక్ష ఎమ్మెల్యేలు చిన్న విమర్శ చేసినా తట్టుకోలేని మధుసూధన్ రెడ్డి ఇప్పుడు గుడి నిర్మాణంతో మరోసారి తన అభిమానాన్ని చాటుకునేందుకు సిద్దమవుతున్నారు.

జగన్ కు గుడి కట్టే కారణం చెప్పిన మధు
వైసీపీ అధినేత, సీఎం జగన్ కు గుడి కట్టడం వెనుక గల కారణాల్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి బయటపెట్టారు. ఓడిపోయిన మధుసూధన్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇచ్చి జగన్ గెలిచించారని, కొందరు అభిమానం లోపల ఉంచుకుంటారు, మరికొందరు బయటికి చెప్పుకుంటారని, తాను ఆ విధంగా గుడి కట్టి అభిమానం చాటుకుంటున్నట్లు మధు వెల్లడించారు.రాముడికి హనుమంతుడిలా నేను జగనన్నకు ఉండిపోతానన్నారు. భార్యాబిడ్డలు కావాలా జగనన్న కావాలా అంటే జగనే కావాలంటానని మధు తెలిపారు. తాజ్ మహల్ భార్య కోసం కట్టారని,. జగన్ గుడి ప్రజల కోసం కట్టానని మధు వెల్లడించారు.

జగన్ ఆలయం ప్రత్యేకతలివే
శ్రీకాళహస్తిలో వైసీవీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి నిర్మిస్తున్న జగన్ ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది కేవలం జగన్ కు గుడి మాత్రమే కాదు. వైసీపీ మ్యానిఫెస్టో అయిన నవరత్నాల అమలును గుర్తు చేసే ఆలయం కూడా. ఇందులో ప్రతీ పథకానికి సంబంధించి ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టారు. అలాగే జగనన్న అద్దాల మహల్ కూడా ఇందులోనే నిర్మించారు. జగన్ విగ్రహంతో పాటు నవరత్నాల పథకాలకు ఆయన రూపకర్తగా నిలిచిన విధానానికి అద్దం పట్టేలా ఈ ఆలయాన్ని మధుసూధన్ రెడ్డి దగ్గరుండి నిర్మింపజేశారు. దీంతో ఈ ఆలయం రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక ఆలయంగా నిలిచిపోనుంది.
జగన్ కు ఉడతాభక్తిగా ఈ ఆలయాన్ని తాను నిర్మించినట్లు మధుసూధన్ రెడ్డి చెప్తున్నారు.
Recommended Video

జగన్ గుళ్లకు పెరుగుతున్న డిమాండ్
ఏపీలో సీఎం జగన్ పై తమకున్న అభిమానం చాటుకునేందుకు ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గుడి నిర్మిస్తుండగా.. ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ఏకంగా గుడి కట్టి చూపించారు. రాష్టంలో ప్రారంభం కాబోతున్న తొలి జగన్ ఆలయం కూడా ఇదే. దీంతో ఇదే బాటలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్ పై తమ అభిమానం చాటుకునేందుకు ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలకు చెందిన శిల్పుల్ని, నిర్మాణదారుల్ని కూడా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో జగన్ గుళ్లు నిర్మించడం ద్వారా ప్రజల గుండెల్లో జగన్ కు సుస్ధిర స్ధానం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications